Sunday, November 24, 2024
HomeUncategorizedManipur: మణిపూర్.. ఓ వైపు హింస.. మరోవైపు డ్రగ్స్

Manipur: మణిపూర్.. ఓ వైపు హింస.. మరోవైపు డ్రగ్స్

మణిపూర్‌లో రెండు తెగల మధ్య భీకర హింస చెలరేగడంతో ఆ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నది. జాతుల మధ్య చిచ్చుపెట్టిన నేతలు యథేచ్చగా తమ డ్రగ్స్‌ దందా నడుపుకొంటున్నారు. ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ దీనిపై పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.

రాజధాని ఇంఫాల్‌లోని బాబూపారా ప్రాంతాన్ని ఇటీవల ఓ విలేకరి సందర్శించారు. అక్కడ ఓ క్యాబ్‌లో ప్రయాణిస్తూ డ్రైవర్‌తో మాటలు కలిపి డ్రగ్స్‌ కావాలని అడిగారు. రూ.1200లకు బ్రౌన్‌ షుగర్‌, రూ.500లకు ఇంజెక్షన్‌ ఇస్తారని పది నిమిషాల్లో తెచ్చిచ్చాడు. ఈ ప్రాంతానికి సమీపంలోనే డీజీపీ కార్యాలయం, బీజేపీ కార్యాలయం ఉన్నప్పటికీ ఆ విలేకరి బస చేసిన హోటల్‌కు దర్జాగా మత్తు పదార్థాలను క్యాబ్‌ డ్రైవర్‌ తీసుకురావడం గమనార్హం. డ్రగ్స్‌తో పాటు బ్యాక్‌ డోర్‌లో స్పా సేవలు కూడా దొరుకుతాయని డ్రైవర్‌ చెప్పాడు. మయన్మార్‌ సరిహద్దుకు 60 కి.మీ దూరంలోనే ఉన్న చురాచాంద్‌పుర్‌ డ్రగ్స్‌ వ్యాపారానికి అడ్డాగా మారింది. మయన్మార్‌ సరిహద్దులో 90 శాతం వరకు కంచెను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ మార్గంలో యథేచ్చగా డ్రగ్స్‌ను సరిహద్దులు దాటించి భారత్‌లోకి తీసుకొస్తున్నారు. డ్రగ్స్‌ వ్యాపారాన్ని నియంత్రించేందుకు 2018లో ప్రారంభించిన ‘వార్‌ ఆన్‌ డ్రగ్స్‌’ కార్యక్రమం ప్రభుత్వం పట్టించుకోపోవతంతో నిర్వీర్యం అయింది.

మణిపూర్‌ పోలీసు అధికారి థౌనా ఓజమ్‌ నేతృత్వంలో 2018లో హై ప్రొఫైల్‌ డ్రగ్‌ మాఫియా నాయకుడు లుహఖోసీ జోవూ భారీ మొత్తంలో డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని విడిచిపెట్టాలంటూ సీఎం బీరేన్‌ సింగ్‌ తమపై ఒత్తిడి చేసినట్టు పోలీసులు మణిపూర్‌ హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించారు. సీఎం స్వయంగా తనకు వాట్సాప్‌ కాల్‌ చేసి ఆ మాఫియా లీడర్‌ను విడిచిపెట్టాలని ఆదేశించినట్టు పోలీసు అధికారి థౌనాఓజమ్‌ ఆరోపించారు. మరో బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఓక్‌రామ్‌ ఇబోబీ సింగ్‌ మేనల్లుడు ఓర్‌పామ్‌ హెన్‌రీ సింగ్‌ భారీగా డ్రగ్స్‌ కలిగి ఉండగా సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత బీజేపీ నాయకుడు రామ్‌మాధవ్‌ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరి కేసు నుంచి తప్పించుకున్నారు.

మరో 5 రోజులు ఇంటర్నెట్‌ బంద్‌

మణిపూర్‌లో అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఆ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. అల్లర్లు జరిగే ఆస్కారం ఉండటంతో ఇంటర్నెట్‌ సేవల బంద్‌ ఇంకా కొనసాగుతున్నది. తాజాగా మరో ఐదు రోజులపాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆదివారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా… వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ చాలా జిల్లాల్లో భద్రతా బలగాలు మోహరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్