భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సిఎం జగన్ కు అండగా లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీకి ధీటుగా ఎదగాలని తాము ప్రయత్నిస్తుంటే.. ‘బిజెపి తనకు అండగా ఉండకపోవచ్చు’ అంటూ తాము గతంలో ఏదో ఆయనకు అండగా ఉన్నట్లు సిఎం జగన్ మాట్లాడడం సరికాదని, భ్రమ రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తో కలిసి మీడియాతో మాట్లాడారు.
అవినీతిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ శా చేసిన వ్యాఖ్యలు తప్పయితే వాటిపై సిబిఐతోనో, సిట్టింగ్ జడ్జితోనో విచారణ జరిపించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. రాష్టంలో వైసీపీ నేతల సహకారంతో భూ, ఇసుక, లిక్కర్ దందాలు జరుగుతున్నా మాట వాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏం చేశారో చేబితో బాగుండేదంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలపై స్పందిస్తూ, కేంద్ర సహకారంపై రాష్ట్ర పార్టీల అసత్య ప్రచారం పేరుతో తాము ప్రచురించిన పుస్తకాన్ని వైసీపీ నేతలకు పంపుతామని, మోడీ ప్రభుత్వం ఎపీకి ఏం చేసిందో దానిలో స్పష్టంగా వివరించామని, వీటిని చదువుకున్న తర్వాత బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తమ వాటిగా చెప్పుకుంటున్న వైసీపీ నేతలు దానిపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
విశాఖలో సిఎం జగన్ అండతో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, భూముల ఆక్రమణపై గతంలో నియమించిన సిట్ నివేదికను ఇంతవరకూ ఎందుకు బైట పెట్టలేదని జీవీఎల్ అడిగారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదవాల్సిన అవసరం లేదని, మా పార్టీ నేతలు చెప్పే ప్రతి విషయం కేంద్ర నాయకత్వం సూచనలు, ఆదేశాలతోనో జరుగుతాయన్నారు.