కాశీ యాత్ర లాగా వారాహి యాత్ర ఏమిటని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన బస్సు యాత్ర చేస్తున్నారంటే దానికో అర్ధం ఉందని కానీ వారాహి యాత్ర ఏమిటని వ్యంగాస్త్రం సంధించారు. యాత్రలకు పోలీసుల అనుమతి తీసుకోవడం అనేది చట్టంలో ఓ భాగమని, దాన్ని ప్రత్యేకంగా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో తాను స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి పర్మిషన్ అడిగానని గుర్తు చేశారు. పవన్ యాత్రపై ఎలాంటి పోలీసుల ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. విజయవాడలో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరైనా ఎలాంటి రాజకీయ కార్యక్రమాలైనా చేసుకోవచ్చని పేర్కొన్నారు.
బిజెపి రాష్ట్రంలో 20 సీట్లు ఎలా సాధిస్తుందని, చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లుందని బొత్స ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఏపీలో ఉన్న ఓటు బ్యాంకు 2-3శాతం మాత్రమే ఉందని, పొత్తులతో వెళ్తున్నామని చెబితే బాగుండేదని అన్నారు. గురివింద సామెత గాలా బిజెపి ముందు తన కింద ఉన్న మచ్చ గురించి ఆలోచించాలని, దేశంలో వారి పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. విభజన హామీల సంగతి ఏమైందని బొత్స నిలదీశారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలను అమిత్ షా ప్రస్తావించారని విమర్శించారు. కేంద్ర పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రానికి ఇస్తున్న నిధులు హక్కుగా ఇస్తున్నవేనని, ప్రత్యేకంగా నిధులు ఇస్తే చెప్పాలని కోరారు.
తాము గతంలో ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నా ప్రత్యేకహోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్ లాంటి సమస్యల విషయంలో వైసీపీ పోరాటం చేస్తూనే ఉందని, పార్లమెంట్ లో తమ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారని… మరోవైపు సిఎం హోదాలో జగన్ సైతం కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విన్నవిస్తున్నారని బొత్స తెలిపారు.