మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన తొలి విడత మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘జోనల్ ఔట్ రీచ్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఐదు బస్సులను అద్దెకు తీసుకొని ‘ భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరిట 125 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి తమ పథకాలను ప్రజలకు వివరిస్తామని, ఒక్కో జోన్ కు ఒకటి చొప్పున ఐదు బస్సులను ప్రారంభిస్తామని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సహచర నేతలతో కలిసి అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. సోమవారంనాడు ఈ బస్సులను చంద్రబాబు జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు.
ఏపీ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీదా రెండున్నర లక్షల రూపాయల అప్పు పెరిగిందన్నారు. ఆర్ధిక వ్యవస్థపై కనీస అవగాహన లేని వ్యక్తి సిఎం జగన్ అని, అందుకే రాష్ట్రం దివాలా తీసిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అనుభవంతో ఏపీ ఆదాయాన్ని గణనీయంగా పెంచి దాన్ని ప్రజలకు పంచుతామని విశ్వాసం వెలిబుచ్చారు.
సిఎం జగన్ గొప్ప నటుడని, ఆస్కార్ కు వెళితే ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని అచ్చెన్న వ్యాఖ్యానించారు. బిజెపితో సంబంధం లేదని అమాయకంగా చెబుతున్నారని, నిజంగా బిజెపి అండ లేకపోతే అవినాష్ రెడ్డి అరెస్టు ఎలా ఆగిందో, జగన్ కేసు ఎందుకు ముందుకు సాగడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ బిజెపితో మాకు సత్సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారని గుర్తు చేశారు. కేవలం సింపతీ కోసమే జగన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు వస్తున్నాయని, తాము నాలుగేళ్ళపాటు రెవిన్యూ లోటు డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చారని అచ్చెన్న విస్మయం వ్యక్తం చేశారు. బిజెపి నేతలు చేసిన విమర్శలకు జగన్ సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. వారి వ్యాఖ్యలతో తమకు ఏం సంబంధం ఉంటుందని నిలదీశారు.
అనంతరం పార్టీ బిసి విభాగం రూపొందించిన ‘బిసిల భరోసా బాట’ పోస్టర్ ను అచ్చెన్న ఆవిష్కరించారు. ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, బిసి విభాగం కన్వీనర్ కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
బిసిల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఓ కార్యాచరణ రూపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని, దీనికోసం ఈ భరోసా బాట కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నామని కొల్లు వివరించారు.