రోజంతా నడిస్తే జనం వెంట రావడంలేదని కేవలం సాయంత్రం నాలుగు గంటల తరువాతే లోకేష్ పాదయాత్ర మొదలు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పొద్దున నుంచి సాయంత్రం వరకూ విశ్రాంతి తీసుకొని, జనాన్ని పోగు చేసుకున్న తరువాత అప్పుడు లోకేష్ యాత్ర మొదలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. సిఎం జగన్ కూడా గతంలో పాదయాత్ర చేశారని కానీ లోకేష్ లాగా చేయలేదని.. ఎండాకాలం, వానాకాలం. శీతాకాలంలో కూడా జగన్ యాత్ర కొనసాగించారని గుర్తు చేశారు. జిల్లాలో లోకేష్ యువ గళం పాదయాత్రకు ఏమాత్రం స్పందన లేదన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు.
నిన్న లోకేష్ రైతులతో ముఖాముఖి నిర్వహించారని… దానిలో కనీసం రైతులను కూర్చో బెట్టి ఉంటే బాగుండేదని, టిడిపి కార్యకర్తలతో మాట్లాడించారని పేర్కొన్నారు. గత టిడిపి హయంలో తాగు, సాగు నీరు కూడా లేదని, కానీ తమ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని లోకేష్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. కనీసం ఐదు పంటలను గుర్తించలేని…. ఏ పంట ఏ నెలలో వేయాలో కూడా తెలియని లోకేష్… స్వామినాథన్ కంటే మేధావి లాగా వ్యవసాయంపై రైతులకు దిశానిర్దేశం చేశారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గతంలో..రైతు రథం, నీరు-చెట్టు పేరుతో డబ్బులు దండుకున్నారని.. ఆ పథకాల అమలుపై విచారణకు సిద్ధం కావాలని కాకాణి సవాల్ చేశారు. టిడిపి పాలనలో నాసిరకం ఎరువులు, విత్తనాలు సరఫరా చేశారని.. రైతులు వీటికోసం క్యూలో నిల్చోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత లోకేష్ కు లేదన్నారు.
కోర్టు దొంగ అంటూ తనపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. తానెప్పుడూ కోర్టుల చుట్టూ తిరగలేదని, ఇక్కడ జరిగిన సంఘటనపై విచారణ జరుగుతోందని, అది పూర్తయిన తరువాత మాట్లాడతానని చెప్పారు. ఓటుకు నోటు కేసులో నేరుగా దొరికిన దొంగ మీ బాబు కాదా అంటూ ఫైర్ అయ్యారు.