పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపించినప్పుడు తమ పార్టీ నేత పేర్ని నాని రెండు చెప్పులు చూపించడంలో తప్పేమిటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని, అసలు మొదట చెప్పు చూపించింది పవన్ కాదా అని అడిగారు. అధినాయకులు, రాష్ట్రాన్ని పాలించాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. చెప్పు రాజకీయం చేస్తున్నది పవన్ మాత్రమేనని, ఇప్పటికైనా ఈ తరహా రాజకీయాలు మానుకోవాలన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను నా కొడుకుల్లారా అని సంబోధించిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు.
తన సినిమాలు ఎన్న ప్లాపులు అయినా మళ్ళీ మళ్ళీ నటించి విజయం సాధించారని, అలాగే రాజకీయాల్లో కూడా విజయం వరించే వరకూ పోరాడుతూనే ఉండాలని రాంబాబు పవన్ కు సలహా ఇచ్చారు. అంతే కానీ అభిమానులు తనను గెలిపించలేదు కాబట్టి నేను ఒంటరిగా పోటీ చేయనని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ వస్తున్నందునే సెక్షన్ 30 పెట్టలేదని, చంద్రబాబు సభల్లో అమాయక ప్రజలు చనిపోయిన దృష్ట్యా, ఇలాంటి సభల్లో ప్రజలను నియంత్రించేందుకు చట్టపరంగా చేపట్టే చర్యలని పేర్కొన్నారు. పవన్ చూసి తాము ఎందుకు భయపడతామని, ఆయన సభలకు జనం వస్తున్నంత మాత్రాన భయపడతామా, అసలు ఆయన ప్రభావం ఎంత ఈ రాష్ట్రంలో అంటూ రాంబాబు ఎదురుదాడి చేశారు. ప్రజల విశ్వాసాన్ని పొందలేని పవన్ తమపై పడి ఎడుస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బాబు- పవన్ కళ్యాణ్- బిజెపి కలిసి వచ్చినా ధీటుగా ఎదుర్కొంటామని, 50శాతం పైగా ప్రజలు జగన్ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంతో సరికొత్త పద్దతిని ప్రవేశ పెట్టారని కొనియాడారు. తాము భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి వస్తామని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద గైడ్ బండ్ కుంగిన మాట నిజమేనని, అయితే అది ప్రమాదకరవిషయం కాదని అంబటి స్పష్టం చేశారు. ఇంత ప్రాజెక్టులో ఇలాంటివి సహజమేనన్నారు. స్పిల్ వి లోకి వస్తున్నా ప్రవాహాన్ని నియంత్రిన్చెందుకే గైడ్ బండ్ వేశామని… ఇది కూలిన సంఘటనపై విచారణ జరిపిస్తున్నామని, దాని వెనుక కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. తమ హయంలో జరిగే చిన్న విషయాలను పెద్దవిగా చేసి చూపిస్తున్న మీడియా గత బాబు హయంలో జరిగిన పెద్ద తప్పులను ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. కాఫర్ డ్యాం వేయకుండా డయా ఫ్రం వాల్ కట్టడం తప్పని నాడు చెబితే ఇంత పెద్ద సమస్యపై ఎందుకు రాయలేదని నిలదీశారు.