పవన్ గంటకో రకంగా మాట్లాడుతున్నారని, ఒకసారి సిఎం అవుతానంటారని, మరోసారి ఎమ్మెల్యేగా అయినా గెలిపించాలంటారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. భరత్ అనే నేను సినిమాలో లాగా సిఎం అవుదామనుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఓట్లు వేస్తేనే ఎవరైనానాయకులు అవుతారని… కానీ పవన్ ను సిఎం కాదు కదా ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. తనవల్ల మేలు జరిగితేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని సిఎం జగన్ అడుగుతున్నారని, ఇలా అడగడానికి దమ్ముండాలని రాజా అన్నారు. తునిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వారాహి యాత్రలో పవన్ చేస్తున్న విమర్శలపై స్పందించారు.
అమ్మవారి పేరుతో ఓ లారీ తయారు చేసుకొని దానిపైకి ఎక్కి తమకు శాపనార్ధాలు పెట్టడం కాదని, రాష్ట్రంలో గతంలో ఏం జరిగిందో… ప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. ప్రజల్లో మంచివాడని ఒక మాట అనిపించుకుంటే చాలని, ఇండిపెండెంట్ గా అయినా గెలిపిస్తారని, హీరోయిన్లు సుమలత, నవనీత్ కౌర్ లాంటి వారు ఇది నిరూపించారని, పవన్ కూడా ప్రజల్లో పేరు తెచ్చుకుంటే ఎమ్మెల్యే అవుతారని, కానీ బాబు సిఎం చేయడం కోసం తిరిగితే కారని స్పష్టం చేశారు. పవన్ అమాయకులను రెచ్చగొడుతున్నారని, ఒక్కో సభకు కనీసం 500మంది కూడా రాకపోతే ఆయన బాస్ బాబు దగ్గర విలువ ఏముంటుందని వ్యాఖ్యానించారు.
గుళ్ళలో విగ్రహాల ధ్వంసం కేసులో టిడిపి కార్యకర్తలు, ఈనాడు విలేకరి ఒక కేసులో అరెస్టు అయ్యారని, ఈ విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. బాబు హయంలో అమరావతి పరిసరాల్లో ఎన్నో ఆలయాలు కూలగొడితే ఎందుకు మాట్లాడలేదని, నాడు విధ్వంసానికి గురైన ఆలయాలను సిఎం జగన్ పునర్నిర్మిస్తున్నారని దాడిశెట్టి వివరించారు. అమరావతి గురించి మాట్లాడుతున్నారని, కానీ పవన్ భార్యాపిల్లలతో ఒక్క రోజైనా ఈ ప్రాంతంలో నిద్ర చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా ఏదో లాడ్జికి వచ్చినట్లు ఇక్కడకు వచ్చి వెళుతుంటారంటూ ధ్వజమెత్తారు.
తన వద్ద గన్ మెన్ గా పనిచేసిన వ్యక్తి తప్పు చేస్తే తనకేమి సంబంధమని రాజా నిలదీశారు. గతంలో పవన్ వద్ద పనిచేసిన గన్ మెన్ ఒకరు వీర మహిళలను ఇబ్బంది పెట్టాడని అతణ్ణి తొలగించారని, దీనికి ఆయన బాధ్యత తీసుకుంటారా అని అడిగారు. ఎల్లో మీడియా ఏదో రాసిందని ఆరోపణలు చేయడం కాదని వెనకా ముందూ చూసుకోవాలని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.