వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వచ్చినా, ముప్పై పార్టీలు కలిసి వచ్చినా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ గూండాల పార్టీ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించారు. జనసేనలో రౌడీ కానివాడిని ఒక్కడిని చూపించాలని సవాల్ చేశారు. వైసీపీలో ఉన్న తాను రౌడీని ఎలా అయ్యానని, పవన్ పై ఒకటో రెండో కేసు ఉండి ఉండొచ్చని, కానీ తనపై ఒక్క కేసు అయినా ఉంటే చూపించాలని ఛాలెంజ్ విసిరారు. అందరినీ ఒకే గాటన కట్టి మాట్లాడడం సరికాదని, మైక్ ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పవన్ కు ఓ విధానం, ఆలోచన లేవని పునరుద్ఘాటించారు. జనసేన దొంగల పార్టీ, రౌడీల పార్టీ అని ఎదురుదాడి చేశారు.
గుడివాడలో టిడ్కో ఇళ్ళ పంపిణీపై చంద్రబాబు చేసిన ‘ఎవరికో పుట్టిన బిడ్డను…’ వ్యాఖ్యలపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏదైనా అంటే ఏడ్చే చంద్రబాబుకు ఇలా మాట్లాడడానికి ఇంగిత జ్ఞానం ఉందా అని నిలదీశారు. అసలు ఆయన గతంలో ఎందుకు ఏడవాల్సి వచ్చిందో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని… టిడ్కో ఇళ్ళను ఆయన మొదలు పెట్టి ఉండొచ్చని కానీ ఒక్క ఇళ్ళు కూడా పంపిణీ చేయలేదని, నేనే పూర్తి చేశా అని చెప్పడం సరికాదని బొత్స విమర్శించారు. వయసుకు తగ్గట్లు మాట్లాడాలని, వక్ర భాష్యాలు చెప్పి.. ఎదుటివారు ఏదైనా అంటే తల తీసి ఎక్కడ పెట్టుకుంటారని బాబుపై ఫైర్ అయ్యారు.