మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తనయుడు చరణ్ కు గత కొంతకాలంగా పిల్లలు లేరని.. ఎప్పుడు చరణ్ తండ్రి అవుతాడా అని చిరు ఇన్నాళ్లు ఎదురు చూశారు. ఇప్పుడు జూన్ 20న చరణ్, ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చరణ్, ఉపాసనలకు 2012లో వివాహం అయ్యింది. వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారని గత సంవత్సరం డిసెంబర్ 12న ఇరు కుటుంబాలు ప్రకటించారు. కొన్ని రోజులు క్రితం ఉసాసన సీమంతం వేడుకను ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
చరణ్, ఉపాసల బిడ్డకు స్వరవాణి కీరవాణి తనయుడు కాలభైరవ ప్రత్యేక బాణీ రూపొందించడం విశేషం. ఈ స్పెషల్ ట్యూన్ ను కాలభైరవ… రామ్ చరణ్, ఉపాసనలకు కానుకగా పంపించారు. ఊహించని గిఫ్ట్ తో చరణ్, ఉపాసన ముగ్ధులయ్యారు. బిడ్డకు స్వాగతం పలకబోతున్న ఆనందంలో ఉన్న తమకు ఈ మ్యూజికల్ గిఫ్ట్ మరింత ఆనందం కలిగించిందంటూ కాలభైరవకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చరణ్, ఉపాసన చిరుతో కాకుండా వేరే ఇంట్లో విడిగా ఉంటున్నారు.
అయితే.. ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత అత్తమామలతో కలిసి ఉండాలి అనుకుంటున్నామని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్ర పోషించారని.. అందుచేత గ్రాండ్ పేరంట్స్ తో వుంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలి అనుకోవడం లేదన్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి చరణ్, ఉపాసన దంపతులకు సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. చరణ్ తండ్రి అవ్వడంతో మెగాస్టార్ ఇంట సంబరాలు మొదలయ్యాయి.