రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని గత 15 రోజుల్లో 15 నేర ఘటనలు జరిగాయని, మణిపూర్ తరహాలో ఏపీలో కూడా శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియమించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఆర్టికల్ 355 ను అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్ కు విజ్ఞప్తి చేసింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం విజయవాడ లోని రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలుసుకుని రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేసింది. బాలుడు అమర్నాథ్ హత్య, మహిళలపై దాడులను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళారు. అచ్చెన్నాయుడు తో పాటు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
అధికార పార్టీ ఎంపీ స్వయంగా ఏపీలో మేం బతకలేం అని అంటుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని డీజీపీ చెప్పటం హాస్యాస్పదమన్నారు. తాము చేసిన అభ్యర్థన గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.