కొందరు రాజకీయ నాయకులు ముస్లిం సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, కానీ తాను అలా చేయబోనని, సత్యాన్ని నమ్మే వ్యక్తినని, మీకు నమ్మకం ఉంటే తనకు అండగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. కాకినాడలో ముస్లిం ప్రతినిధులతో పవన్ భేటీ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. తాను కౌలు రైతులకు అండగా నిలబడినప్పుడు హిందూ సమాజం నుంచి వచ్చిన వ్యక్తులకు ఒకలాగా ….స్లిమ్ సమాజం నుంచి వచ్చిన కౌలు రైతులకు మరోలాగా సాయం చేయలేదని అందరినీ ఒకే దృష్టితో చూశామని వెల్లడించారు. ఇది తన వ్యక్తిత్వమని, భారత దేశపు సనాతన ధర్మం నుంచే ఈ వ్యక్తిత్వం వచ్చిందని చెప్పారు.
ముస్లింలకు ఉపాధి అవకాశాలు పెరగాలని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, వారు నివశించే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆంగ్ల మాధ్యంతో పాటు మాతృభాషలో విద్యా బోధన జరగాలని, ఉర్దూ మీడియం అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సహజంగా బిజెపితో పొట్టు పెట్టుకునే ఏ పార్టీనైనా ముస్లింలు వ్యతిరేకిస్తారని, తాను బిజెపితో పొత్తులో ఉన్నందుకు ముస్లింలు దూరమైతే వారే నష్టపోతారని పవన్ స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి ఆయన అంతా నిజమే చెబుతారని అనుకుంటారని, నిజంగా అల్లాను ప్రార్ధిస్తే నిజం చెప్పేవాడు మీకు తప్పకుండా కనబడతాడు అంటూ వారికి ఉద్బోధ చేశారు. భారత దేశంలో 17 శాతం ఉన్న ముస్లింలు గౌరవంగా బతుకుతున్నారని, కానీ పాకిస్తాన్ లో హిందువులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.