తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే వ్యాపారం హైదరాబాద్ కు మారుస్తానని చెప్పాను కానీ విశాఖ నగరంపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్లాంటి ఆరోపణలు చేయలేదని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు , వైసీపీ నేత ఎంవివి సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖలో రక్షణ లేదని తాను చెప్పలేదని, కేవలం తన వ్యాపారాల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బ తినకూడదన్న ఆలోచనతోనే అలా చెప్పానని వివరించారు. విపక్షాలు, మీడియా చేసిన దుష్ప్రచారం వల్ల మనస్తాపంతోనే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. వైజాగ్ లో తన కార్యాలయంలో ఎంవివి మీడియాతో మాట్లాడారు. వ్యాపారానికి అనుకూలంగా లేదనో, ప్రభుత్వం తనకు అండగా లేదనో ఆ విషయం చెప్పలేదని పేర్కొన్నారు.
కిడ్నాప్ వ్యవహారం డ్రామా అంటూ ఎంపి రఘురామ కృష్ణ రాజు చేసిన వ్యాఖ్యలపై ఎంవివి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లో ఉండి బైటకు రాలేని వ్యక్తి ఇలా విమర్శలు చేయడం సరికాదన్నారు. అతను ఒక గజ్జి కుక్క అని మండిపడ్డారు. చంద్రబాబు హయంలో ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ను మావోలు కాల్చి చంపారని… అప్పుడు ఏమి చేశారని, శాంతి భద్రతలకు విఘాతం కలగలేదా అని ప్రశ్నించారు. విశాఖ కిడ్నాప్ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఎంవివి డిమాండ్ చేశారు. ఎర్ర గంగిరెడ్డితో తనకు సంబంధాలు అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కిడ్నాప్ విషయం తనకు రెండోరోజు వరకూ తెలియదని, తనకు విషయం తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు వెంటనే స్పందించి స్పందించారని చెప్పారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు హేమంత్, ఏ2 రాజేష్ ల నేర చరిత్ర గురించి ఎవరూ రాయడంలేదని, కానీ విషయాన్ని వక్రీకరించి వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.