Thursday, November 28, 2024
HomeTrending NewsBRS Maharatra : మాది రైతులు పేదల టీం - కెసిఆర్

BRS Maharatra : మాది రైతులు పేదల టీం – కెసిఆర్

కేంద్రంలో ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వాల చేతగానితనం వల్ల స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశం బాగుపడలేదని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంగళవారం సోలాపూర్‌ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముందుగా సర్కోలీ సభకు విచ్చేసిన తనకు అపూర్వ స్వాగతం పలికిన భగీరథ్‌ బాల్కేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశం బాగుపడలేదని, దేశం బాగు కోసం ప్రస్తుతం మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలోని సర్కోలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం – ముఖ్యాంశాలు

• భగీరథ్ బాల్కే రానున్న రోజుల్లో చంద్రబాగ్ నీటిని మంగళ్ వాడ్ కు తరలించనున్నారు. వీరి పేరే భగీరథుడు.
• మన దేశానికి ఏదైనా లక్ష్యముందా లేక లక్ష్యం లేకుండా మనం దారి తప్పిపోయామా ? దారి మరిచి చీకట్లో మగ్గుతున్నామా? ప్రతి భారతీయునికి ఈ విషయం పై ఆలోచించాల్సిన అనివార్య సమయమిది.
• మనకు స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు అయింది. ఇది తక్కువ సమయమేమీ కాదు.
• మన కళ్ళ ముందే ఎన్నో దేశాలు గొప్పగా పురోగమించాయి.
• సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, మలేషియా, భౌగోళికంగా హిమాలయాలకు ఆవల మన సరిహద్దు దేశమైనా చైనా దేశం ఉంది. 1982 వరకు చైనా దేశం మన దేశం కంటే బీద దేశంగా ఉండేది. నేడు చైనా దేశం ఎక్కడుంది.. .మనం ఎక్కడున్నాం ? ఈ విషయం పై ప్రతి ఒక్కరు ఆలోచించాలి.
• ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి. ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడుతారు. ఎన్నీ పార్టీలకు మీర మద్దతు పలికారు.
• మహారాష్ట్రలోని మీరు అందలం ఎక్కించని ఒక్క పార్టీ పేరైనా చెప్పండి.
• కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించింది. వీరి తర్వాత ఎన్సీపి కి అవకాశమిచ్చారు. శివసేనకు, బిజెపి కి అందరికీ అవకాశం కల్పించారు. వీరిలో ఒక్కరైనా మీ ఆకాంక్షలను నెరవేర్చారా ?
• నూతన రాష్ట్రమైన తెలంగాణలో అతి తక్కువ సమయంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం.
• నాకు మరాఠీ మాట్లాడటం రాదు.కానీ అర్థం చేసుకోగలను.
• బాల్కే తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి వివరంగా చెప్పారు.
• తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను.
• మహారాష్ట్ర ధనవంతమైన నిలకడైన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఏం తక్కువైంది?
• తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ఇక్కడ అమలు చేస్తే, మహారాష్ట్ర దివాళా తీస్తుందని అంటున్నారు. నిజమే దివాళా తీయడం మాత్రం పక్కా. రాజకీయ నాయకులు దివాళా తీస్తారు. ప్రజలు మాత్రం దీపావళి పండుగ చేసుకుంటారు.
• ప్రజల్ని భ్రమింప చేసేందుకు కొందరు ఉల్టా పల్టా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి మేము డబ్బులు ఎక్కడి నుండి తెస్తున్నాం.
• బిఆర్ఎస్ తెలంగాణ పార్టీ అంటున్నారు. బిఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే, భారతదేశంలో పరివర్తన తెచ్చే ఒక మిషన్. ఇది జాతీయస్థాయిలో పనిచేసే పార్టీ.
• పండరీపూర్ విఠోభా దర్శనం కోసం నేను బయలుదేరినప్పుడు ఎవరెవరు ఏమేం అన్నారో మీరు పత్రికలు, టివిల్లో చూసారు. దేవుడి దర్శనం చేసుకోవాలి గానీ రాజకీయాలు చేయవద్దని అంటున్నారు. పుణ్యక్షేత్రమైన దేవాలయంలో జర్నలిస్టులు పలు రకాలుగా ప్రశ్నించినా నేను ఏం మాట్లాడలేదు. కానీ ఇక్కడ తప్పకుంగా మాట్లాడుతాను.


మహారాష్ట్రంలో మేం ప్రస్థానాన్ని ప్రారంభించి మూడు నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. ఏ పార్టీ మమ్మల్ని వదలటం లేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రకరకాల ప్రకటనలు చేస్తున్నాయి. బిఆర్ఎస్ బిజెపికి బి టీం అని కాంగ్రెస్ అంటున్నది. బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏ టీం అని బిజెపి చెప్తున్నది.
• ఈ టీంలు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. మేము ఎవరి టీం కాదు. మేము రైతులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాకులు, దళితుల టీం.
• ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలో ఎన్నో రకాల నినాదాలిచ్చాయి. కానీ మొట్టమొదటి సారి ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అని నినదించిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఈ నినాదమివ్వలేదు.
• 60 శాతం పైగా ఉన్న రైతులు, కార్మికులు తమ మద్దతును బిఆర్ఎస్ పార్టీకి ప్రకటిస్తుండటం వీరికి భయాన్ని కలిగిస్తున్నది. దీంతో అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నారు. వింత వింత ప్రకటనలు చేస్తున్నారు.
• బిఆర్ఎస్ తెలంగాణకో, మహారాష్ట్రకో పరిమితం కాదు.
• ఈనాడు దేశం అన్ని సమస్యలకు పరిష్కారం పరివర్తిత (సంస్కరించబడిన) భారతదేశమే.
• భారతదేశంలో 41 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది.
• దేశంలో జనలవనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నీటితో దేశంలోని ప్రతి ఎకరా పంట భూమికి సాగునీటితో పాటు, ప్రజావసరాలకు తాగునీటిని అందించవచ్చు.
• ఔరంగాబాద్ (శంభాజీనగర్) ప్రజలు 8 రోజులకొకసారి నీళ్ళు వస్తాయని అంటున్నారు. సోలాపూర్ లో నాలుగైదు రోజులకొకసారి, అకోలాలో 10 రోజులకొకసారి నీళ్ళు వస్తాయని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ముంబై, పూణెలకు కూడా నీటి సరఫరాలో కోతలు విధిస్తున్నారని తెలిసింది. అసలు ఏం జరుగుతున్నది ? ఈ దేశంలో నీళ్ళు లేవా?
• ఈ దేశ జల విధానాన్ని పెకిలించి నూతన జల విధానాన్ని తేవాల్సిన అవసరమున్నది. ఇదే భారత పరివర్తన. ఇది తప్పకుండా జరిగి తీరాలి.
• సమృద్ధిగా జల వనరులున్నా మనం ఎందుకు వంచితులుగా మిగిలిపోవాలి?
• కరెంటు మరో సమస్య. మూడు నాలుగు రకాలుగా విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. రష్యాలోని చెర్నోబిల్ విపత్తు కారణంగా అణు విద్యుత్ ఉత్పత్తి పై వివాదం నెలకొంది. సోలార్ పవర్, పవన విద్యుత్, జల విద్యుత్ ఉత్తత్తిలో కొన్ని పరిమితులున్నాయి. కానీ థర్మల్ విద్యుదుత్పత్తికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు.
• దేశంలో 361 బిలియన్ టన్నులు బొగ్గు నిల్వలున్నాయి. నా మాటలను చర్చించండి. నేను చెబుతున్నది వాస్తవమా కాదా తెలుసుకోండి. అధికారులను అడిగి తెలుసుకొండి. విద్యుదుత్పత్తి విధానాలను కూడా మార్చి, నూతన విద్యుదుత్పత్తి విధానాన్ని తేవాలని బిఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది.
• జల విద్యుత్, సౌర విద్యుత్, థర్మల్ విద్యుత్ లను సమన్వయం చేసి దేశంలోని మారుమూల ప్రాంతాల నుండి పట్టణాల వరకు, చిన్న చిన్న పరిశ్రమల నుండి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు సరిపడా విద్యుత్ ను అందించవచ్చు. మన దేశంలోని బొగ్గు నిల్వలు 150 సంవత్సరాల పాటు దేశావసరాలను తీర్చగలవు. ఇవి నేను చెబుతున్న లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు.
• దేశంలో సమృద్ధిగా బొగ్గు వనరులున్నా రష్యా వంటి విదేశాల నుండి ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవి లోతైన సమస్యలు.
• రైతులంతా ఏకమైతే తప్ప మన సమస్యలకు పరిష్కారం లభించదని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను
• ధనిక మహారాష్ట్రలో రోజూ ఆత్మహత్యలు చేసుకునే రైతుల సంఖ్య పెరుగుతూ పోతుండటం చాలా బాధను కలిగిస్తున్నది. ఇదేనా మన రైతులు చేసుకున్న అదృష్టం??
• రైతులంతా ఏకమైనప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది
• ఉల్లి పంటకు మద్దతు ధర కోసం వేలాదిమంది రైతులు నాసిక్ నుండి ముంబాయి దాకా పాదయాత్ర చేయాల్సిన దుస్థితి. పాదాల నుండి రక్తం కారుతున్నా వారిని పట్టించుకున్న వారు లేరు. సర్కారు స్పందించలేదు.
• రైతు ప్రభుత్వం ఏర్పడితే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది. దీంట్లో ఏం అద్భుతం లేదు.
• మహారాష్ట్రలో బిఆర్ఎస్ సర్కారు ఏర్పడితే రైతులందరికీ పెన్షన్ అందివ్వటంతో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తాం.
• అమెరికాలో నల్ల జాతీయుడైన బరాక్ ఒబామాను దేశాధ్యక్షునిగా ఎన్నుకొని ప్రజలు తప్పును సవరించుకున్నారు. భారత్ లో కూడా ఈ రకమైన మార్పు రావాలి. దళితుల ఉద్ధరణ జరగాలి. ఇది మనమే చేసుకోవాలి. ఇది మన దేశ కర్తవ్యం.
• గతంలో నేను నాగ్ పూర్ కు వచ్చినప్పుడు మీకు ఇక్కడేం పని అంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇక్కడ అమలు చేసి ప్రజల జీవితాలను బాగు చేస్తే నేను ఇక్కడికి రాను, మధ్యప్రదేశ్ కి వెళ్తాను అని చెప్పాను. కానీ ఇక్కడ అమలు చేయరు.
• బోయా పేడ్ బబూల్ కా, ఆయే కహా సే ఆమ్ ? ( తుమ్మచెట్టును నాటితే మామిడి పండ్లు ఎలా కాస్తాయి ?)
• ఆమ్ కా అపేక్షా హై తో ఆమ్ కో పౌదా లగానా చాహియే ( మామిడి పండ్లు తినాలనుకుంటే మామిడి చెట్టునే నాటాలి)
• కాంటోన్ కా పేడ్ లగాకే, ఫలోం కా అపేక్షా కరేతో నహీ మిలేగా (ముండ్ల చెట్టును నాటి, పండ్లు కావాలంటే కుదరదు)
• గాయ్ సే దూద్ లేనా హై తో గాయ్ కో గాస్ దీజియే, ఘదోంకో గాస్ దేదో ఔర్ గాయోన్ కో దూద్ పూచో తో కహా సే మిలేగా (పాలు కావాలంటే ఆవులకు గడ్డి వేయండి, గాడిదలకు గడ్డి వేసి, ఆవుల నుండి పాలు ఎలా పొందగలం?)
• మీకున్న ఓటు శక్తితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు
• మహారాష్ట్ర ప్రజలు తెలంగాణకు వస్తే అక్కడ అమలవుతున్న పథకాలను స్వయంగా చూపిస్తాం.
• 70 కోట్ల మంది రైతాంగం బిఆర్ఎస్ వెంట ఉండగా బిఆర్ఎస్ మరో పార్టీకి టీం ఎలా అవుతుంది?
• రైతులు బిఆర్ఎస్ వెంట ఉన్నారా? యుద్ధం చేద్దామా ?
(మీ వెంటే ఉన్నామంటూ రైతుల నినాదాలు)
• అబ్ కి బార్ కిసాన్ సర్కార్
• మన యుద్ధంలో న్యాయం ఉంది. తప్పకుండా మనం విజయం సాధిస్తాం. కొద్దిరోజుల్లోనే మహారాష్ట్ర మారుతుంది. రైతుల జీవితాలు మారుతాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్