క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ, పివీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు వారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని తెలిపారు. పూర్వ భారత ప్రధాని పివి నరసింహరావు 102 వ జయంతి (జూన్ 28) సందర్భంగా సిఎం కేసిఆర్ వారి సేవలను స్మరించుకున్నారు.
స్థిత స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడు, తనదైన శైలిలో రాజనీతిని, పాలనా దక్షతను ప్రదర్శిస్తూ..’దేశానికి మౌనంగా మేలు చేసిన భారత ప్రధాని పివి నర్సింహారావు’ అని సిఎం కొనియాడారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుకే దక్కుతుందని తెలిపారు.
వారి సేవలను సమున్నతంగా గౌరవించుకునే బాధ్యత మన మీద ఉన్నదని, వారి గొప్పతనాన్ని గుర్తించుకునేందుకు వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం అన్నారు. ‘తెలంగాణ ఠీవి మన పీవీ’ అని సిఎం పునరుద్ఘాటించారు. వారి స్పూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని సిఎం స్పష్టం చేశారు.