తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొర్రెల పెంపకం, అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, పశు సంవర్ధక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి KCR లక్ష్యమని, ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీతో 6500 కోట్ల సంపద సృష్టించబడిందని మంత్రి తెలిపారు.
రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 6 వేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు మంత్రి వెల్లడించారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని గొర్రెల యూనిట్ ధరను 1.25 లక్షల రూపాయల నుండి 1.75 లక్షల రూపాయలకు సిఎం కెసిఆర్ పెంచారని చెపారు. ధనవంతులైన గొల్ల, కురుమలకు తెలంగాణ అడ్రస్ గా నిల్వనుందని, పశుగ్రాసం కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో గొర్రెల మార్కెట్ ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని, దశల వారిగా పశు వైద్యశాలల అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలులో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది కృషి ఎనలేనిదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రశంసించారు.