ప్రభుత్వ పథకాల అమలుపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. నవరత్నాల అమలులో జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ నేడు టిడిపి చేసిన ఆరోపణలపై స్పందించిన జోగి… అచ్చెన్నాయుడు విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు, అచ్చెన్న ప్రాతినిధ్యం వహించే కుప్పం, టెక్కలి నియోజకవర్గాల్లో వారు సూచించిన ఏదైనా ఒక గ్రామంలో పథకాల అమలు తీరును పరిశీలిద్దామని జోగి ప్రతిపాదించారు. గత ఐదేళ్ళ కాలంలో మహిళల అకౌంట్లలో జమ చేసిన ఆర్ధిక సాయంతో పాటు, ఈ నాలుగేళ్ల కాలంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా అందించిన లబ్ధిని మీడియా సమక్షంలోనే పరిశీలిద్దామని సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. టిడిపి వారు ‘ ప్రకాశిస్తున్న నవరత్నాలు- పారిపోతున్న చంద్రబాబు’ అని పేరు పెట్టుకోవాలని హితవు పలికారు
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చర్చించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, దీనిపై వారు స్పందించాలని మంత్రి జోగి డిమాండ్ చేశారు. గతంలో పార్టీ లేదు బొక్కా లేదు అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారంటూ అచ్చెన్నాయుడును విమర్శించారు.
సిఎం జగన్ సూచన మేరకు గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం. జగనన్నకు సురక్ష కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లి పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకుంటున్న ప్రభుత్వం తమదేనని, దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వమూ ఇలా ప్రజల వద్దకు వెళ్లలేదని చెప్పారు. నాలుగేళ్లలోనే 99శాతం హామీలు అమలు చేసిన ఘనత కూడా తమకే దక్కుతుందన్నారు.