కర్ణాటకలో అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్లే వచ్చే ఎన్నికల్లో అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలో వస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఖమ్మంలో జరిగిన తెలంగాణ గర్జన సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్ హడావిడిగా పంచుతున్న పోడు భూములు సీఎం సొత్తు కాదు అని, అవి గతంలో కాంగ్రెస్ పార్టీ హక్కు కల్పించిన భూములే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొత్తం పోడు భూములన్నీ పంచుతామన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ దోపిడీ భారీగా ఉందని, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే లక్షకోట్ల అవినీతికి పాల్పడినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములు లాక్కొన్నారని, వేలకోట్ల భూములను గుంజుకున్నారని భారత్ జోడోయాత్రలో ప్రజలు బాధలు పంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మిషన్ భగీరథలోనూ వేలకోట్లు దోపిడీ చేసినట్లు ఆరోపించారు. దళితులు, ఆదివాసీలునుంచి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని దుయ్యబట్టారు.
బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీంగా మారిందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇన్నాళ్లు తెలంగాణలో బీజేపీ, బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అనుకునేవారని, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ ఖతం అయిపోయిందన్నారు. తెలంగాణలో ఇప్పుడు పోటీ కాంగ్రెస్‌కు, బీజేపీ బీ టీం బీఆర్ఎస్‌కు మధ్యే ఉంటుందన్నారు. పార్లమెంటులో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడితే, బీఆర్ఎస్ మాత్రం మద్దతిచ్చిందన్నారు. బీజీపీకి బీ టీమ్‌గా బీఆర్ ఎస్ మారిందనే విషయం ప్రజలు గ్రహించారన్నారు.
తెలంగాణలో వివిధ రకాలుగా కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన దోపిడి లెక్కల వివరాలన్నీ ప్రధాని మోదీ చేతిలో ఉన్నాయని, కేంద్ర దర్యాప్తు సంస్థలకూ ఈ విషయం తెలుసన్నారు. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ ఇప్పుడు మోడీ చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జోడోయాత్రలో భాగంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించిందని, హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. ఖమ్మం చారిత్రాత్మక సభ వేదిక నుంచి సామాజిక పెన్షన్లను నెలకు నాలుగు వేల రూపాయలకు పెంచుతున్నట్లు రాహుల్ ప్రకటించారు.
ఖమ్మం సభలో రాహుల్ గాంధీ కి ముద్దు పెట్టిన గద్దర్
కర్ణాటక ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని, పేదలను దోపిడీ చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చారని, ఆ అవినీతి పార్టీని ఓడించడంలో ప్రతి కుటుంబం కాంగ్రెస్ వెంట నిలబడిందని రాహుల్ చెప్పారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, ధనికులు ఒకవైపు- కాంగ్రెస్ మైనార్టీలు, పేదలు, దళితులు, రైతులు, ఆదివాసీలు ఒకవైపు నిలిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఇదే జరగబోతోందని చెప్పారు.
కేసీఆర్, కుటుంబం, కాంట్రాక్టర్లు తెలంగాణలో వేలకోట్లు దోచుకున్నారని, రైతులు, గిరిజనులు,దళితులు, మైనార్టీలు కేసీఆర్ దోపిడీని వ్యతిరేకిస్తున్నారన్నారు. అందుకే కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ వస్తాయన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించినట్లే, తెలంగాణలో బీజేపీ బీ టీం బీఆర్ ఎస్‌ను ఓడించపోతున్నామన్నారు.
ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్ ఎస్ వస్తే మేము హాజరుకామన్నాము ’ఇటీవల ఢిల్లీలో విపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ ఎస్ వస్తే కాంగ్రెస్ హాజరుకాదని చెప్పాం ఎందుకంటే, బీఆర్ ఎస్ బీజేపీ బీ టీం…కాబట్టి వారు వస్తే మేము హాజరుకాము. వారితో కలిసి కూర్చోము. బీజేపీతో, ఆపార్టీ బీ టీం బీఆర్ ఎస్‌తో కాంగ్రెస్‌కు ఎలాంటి ఒప్పందం ఉండదు.’’ అని రాహుల్ స్పష్టం చేశారు.
వివిధ కారణాల వల్ల తెలంగాణలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోయారని, వారు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి తిరిగి వస్తే పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని రాహుల్ గాంధీ అన్నారు. ’’మీ అందరి సమక్షంలో వారికి చెబుతున్నా…మీకోసం మా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని. తెలంగాణ యువతకు ఒక విషయం అర్థం కావాలి.
కేసీఆర్ అవినీతికి కారణం మోడీ ఆశీర్వాదం. కేసీఆర్ ఏమేమి కుంభకోణాలు చేశారో మోడీ దర్యాప్తు సంస్థలకు తెలుసు. కానీ ఏమీ చర్యలు లేవు. ఎందుకంటే బీఆర్ ఎస్ బీజేపీ పార్టీ బీ టీం. బీఆర్ ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ.
కార్యకర్తలు మా వెన్నంటి ఉంటే, బీఆర్ ఎస్‌ను మేము సునాయాసంగా ఓడిస్తాము. కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించినట్లు ఇక్కడా ఓడించాలి. మీ అభిమానానికి, మద్దతుకు మనస్సూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు.
ఖమ్మం సభలో తన ప్రసంగం మొదట్లోనే రాహుల్ గాంధీ భట్టీ విక్రమార్క పాదయాత్రను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి భట్టి యాత్ర ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీ స్వాగతం చెబుతోందన్నారు. రాహుల్ గాంధీ హిందీ ప్రసంగాన్ని కాంగ్రెస్ నేత ఉత్తమకుమార్‌రెడ్డి తెలుగులోకి అనువాదం చేశారు.