Mini Review: నాగశౌర్య హిట్ అందుకుని చాలా కాలమైంది. టాలీవుడ్ లో హిట్ అత్యవసరమైన హీరోల్లో ఆయన ఒకరు. ఒక వైపున సొంత బ్యానర్ పైన .. మరో వైపున బయట బ్యానర్లలోను వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. కానీ సక్సెస్ మాత్రం ఆయనతో దోబూచులాడుతూనే ఉంది. నాగశౌర్యలో హీరో కంటెంట్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోగా ఆడియన్స్ ఆయనను అంగీకరించారు .. కొన్ని హిట్లు కూడా ఇచ్చారు. కానీ కొంతకాలంగా మాత్రం సక్సెస్ అనేది దరిదాపుల్లో కనిపించక ఆయన సతమతమవుతున్నాడు.
అలాంటి నాగశౌర్య ‘రంగబలి’ సినిమాతో నిన్న థియేటర్లకు వచ్చాడు. పవన్ బాసంశెట్టి దర్శకుడు .. ఆయన జనాలకి పెద్దగా తెలియదు. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాత్రం తన బ్యానర్ నుంచి కాస్త విషయం ఉన్న సినిమాలను వదులుతారనే నమ్మకం ఉంది. ఈ సినిమాతోనే యుక్తి తరేజా టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ లో కామెడీ కంటెంట్ ఉండేలా చూసుకునే రిలీజ్ చేశారు. అయితే అందరూ టీజర్ .. ట్రైలర్ చూసి థియేటర్లకు వస్తారని అనుకోవడం కూడా కరెక్టు కాదు.
‘రంగబలి’ అనే టైటిల్ పవర్ఫుల్ గానే ఉంది. ఈ కథ అంతా కూడా ఈ పేరు చుట్టూనే తిరుగుతుంది. అందువలన ఈ టైటిల్ పెట్టడమే కరెక్టు అని మేకర్స్ అనుకుని ఉండొచ్చు. కానీ ఈ తరహా టైటిల్స్ వలన యాక్షన్ పాళ్లు .. హింస ఎక్కువగా ఉంటాయని ఫ్యామిలీ ఆడియన్స్ భావించే అవకాశం ఉంది. అందువలన వాళ్లు పెద్దగా ఆసక్తిని చూపించకపోయే ఛాన్స్ ఉంది. కానీ నిజానికి ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా. యాక్షన్ ఉన్నప్పటికీ ఎక్కడా రక్తం కనిపించదు. పైగా మొదటి నుంచి చివరి వరకూ నవ్వించే కామెడీ ఉంది. కాబట్టి టైటిల్ పై అపోహలు పక్కన పెట్టేసి థియేటర్స్ కి వెళితే, మంచి కంటెంట్ ఉన్న సినిమాను చూడొచ్చు.