నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదంకోసం కేబినెట్ సిఫారసు చేసింది. సంబంధిత ఫైలును గవర్నర్ కార్యాలయనికి ఆమోదం కోసం పంపింది.
లాభసాటి పంటల సాగుకు ప్రాధాన్యత :
రాష్ట్రంలో ప్రస్థుతం వానాకాలం సీజన్ నడుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాచరణ పై కేబినెట్ సమీక్షించింది. గత కొద్దికాలంగా కురుస్తున్న వర్షాలు, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు రిజర్వాయర్లు చెరువులు కుంటలల్లో నీరు చేరుతున్న పరిస్థితి, వరినాట్లు పడుతున్న సందర్భంలో, పలు రకాల పంటల సాగు ప్రారంభమైన తరుణంలో వాటికి సాగునీటి లభ్యత, రైతులకు ఎరువులు అందుబాటు, తదితర వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ అంశాల పై కేబినెట్ చర్చించింది. ఈసందర్భంగా పత్తిసాగు పై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల పత్తి సాగును రాష్ట్రవ్యాప్తంగా మరింతగా పెంచాలని కేబినెట్ ఆదేశించింది. వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి, లాభసాటి పంటల సాగును మరింతగా ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కేబినెట్ ఆదేశించింది.
అనాథ శరణాలయాల పై చర్చ :
కరోనా కాలంలో అనాధలైన పిల్లలను కాపాడుకోవాలని నిర్ణయం :
రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన గురించిన చర్చతో కేబినెట్ సమావేశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల పూర్తి వివరాలను తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలన్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎదిగే వయస్సులో వున్న పిల్లలు వంటరిగా మారి మానసిక వేదనతో పాటు సామాజిక వివక్షను ఎదుర్కుంటూ సమాజ క్రూరత్వానికి బలయ్యే ప్రమాదమున్నది. వాల్ల కాల్ల మీద వాల్లు నిలబడి ప్రయోజకులయ్యేంతవరకు వారికి ప్రభుత్వమే ఆశ్రయం కల్పించి అండగా నిలవాలి. గతంలో అనాధ పిల్లలకు బీసీ హోదా ఇవ్వడంతో పాటు వారి రక్షణకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం. అనాథ పిల్లలకోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలి. మానవీయ కోణంలో ప్రభుత్వయంత్రాంగం స్పందించాలి. అనాధ పిల్లల అంశానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి..’’ అని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఖాళీగా వున్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.
ఇందుకు సంబంధించి కార్యాచరణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో.. మంత్రులు, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెటిఆర్…సభ్యులుగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ఆహ్వానితులుగా కొనసాగనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల పరిస్థితుల మీద సమగ్ర నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వైద్యశాఖ పై చర్చ :
కరోనా వ్యాప్తి పై ముందస్తు చర్యలు :
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితి పై కేబినెట్ కు వైద్యశాఖ వివరాలు సమర్పించింది. దేశంలో పలు రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితి గురించి ఆరా తీసింది. రాష్ట్రంలో కొనసాగుతున్న వాక్సినేషన్ ప్రక్రియ, దవాఖానాల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతుల పై కేబినెట్ చర్చించింది. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం పై, ఆయా జిల్లాల ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి సవివరంగా కేబినెట్ కు వైద్యాధికారులు సమాచారం అందించారు. సమస్యాత్మక జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సీజన్, మందులు, బెడ్స్, తదితర ఔషదాల లభ్యతపై విస్త్రుతంగా కేబినెట్ చర్చించింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, అన్ని రకాల మందులు, ఆక్సీజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు కేబినెట్ ఆదేశించింది. కేసులు ఎక్కువగా నమోదవున్న సమస్యాత్మక ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలను పర్యటించి రావాలని, తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించింది.
కరోనా ను కట్టడి చేయడంలో ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని, అందులో భాగంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలను తీసుకోవాలని కేబినెట్ ప్రజలకు విజ్జప్తి చేసింది. వాక్సిన్ తీసుకున్నవాల్లు కూడా నిర్లక్ష్యం చేయకుండా స్వీయ నియంత్రణను పాటించాలని కోరింది.
వైద్యరంగాన్ని పటిష్టం చేయాలి :
నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు :
నూతనంగా మంజూరు చేసిన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం అవసరమైన మౌలిక వసతుల కల్పన పై కేబినెట్ చర్చించింది. మెడికల్ కాలేజీల ప్రారంభానికి కావలసిన నిర్మాణాలను చేపట్టాలని, వసతుల కల్పనకోసం తగు ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. హైద్రాబాద్ నిమ్స్ ను మరింతగా అభివృద్ధి పరిచి వైద్య సేవలను విస్త్రుత పరిచేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్దం చేసి వచ్చే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని వైద్యాధికారులను కేబినెట్ ఆదేశించింది.
ఇప్పటికే మంజూరైన మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం చేయడానికి సమకూర్చుకోవాల్సిన బెడ్లు తదితర మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టల్ల నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించింది. భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కొరకు స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటినుంచే ప్రారంభించాలని వైద్యాధికారులను కేబినెట్ ఆదేశించింది. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని కేబినెట్ ఆదేశించింది.
కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలపై చర్చించిన కేబినెట్,. వాటి సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతి పై వైద్యాధికారులనుంచి ఆరాతీసింది. త్వరలోనే వీటి నిర్మాణానికై శంఖుస్థాపన చేయాలని ఆదేశించింది. గచ్చిబౌలి లో ఉన్న టిమ్స్ దవాఖానతో పాటు, హైద్రాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లకు ‘‘ తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ’’ (TIMS) గా నామకరణం చేయాలని కేబినెట్ తీర్మానించింది. టిమ్స్ గచ్చిబౌలి, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ ఎల్ బీ నగర్, టిమ్స్ అల్వాల్ దవాఖానాలుగా అభివృద్ధి చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్కచోటనే అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కేబినెట్ ఆదేశించింది. వరంగల్ లో ఇప్పటికే మంజూరు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ పురోగతి పై చర్చించిన కేబినెట్ , త్వరలో నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
పటాన్ చెరువులో కార్మికులు ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను కేబినెట్ మంజూరు చేసింది. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ స్థాపన లక్ష్యంగా, రానున్న రెండు,మూడు సంవత్సరాల్లో ఇప్పటికీ మెడికల్ కాలేజీ లేని జిల్లాలను గుర్తించి, దశలవారీగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది.
57 ఏండ్లకు పెన్షన్ అమలు ప్రక్రియను ప్రారంభించండి : సిఎం ఆదేశం
వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. కుటుంబంలో ఒక్కరికే ఫించను పద్దతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
దోభీ గాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఫ్రీ కరెంటివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటూ పర్యవేక్షించాలని కలెక్టర్లను కేబినెట్ ఆదేశించింది.