తెలుగులో ఇప్పుడు మలయాళ కథలు మాత్రమే కాదు, మలయాళ స్టార్స్ జోరు కూడా పెరుగుతోంది. అలా ఈ మధ్య కాలంలో మలయాళం వైపు నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘షైన్ టామ్ చాకో’. కేరళ ప్రాంతానికి చెందిన చాకో .. వెండితెరకి పరిచయమై దాదాపు 20 ఏళ్లు దాటింది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఆయన వరుస మలయాళ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ సినిమాలకు ఆదరణ పెరగడం వలన, ఆయన ఇతర భాషలకి చెందిన మేకర్స్ కీ .. ఆడియన్స్ కి తెలిశారు.
చాకో చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తారు. చూడగానే ఒకప్పటి సాయిచంద్ రూపానికి దగ్గరగా అనిపిస్తారు. హీరోలతో కండబలంతో తలపడే పర్సనాలిటీ కాదుగానీ, కంటి చూపులతోనే విలనిజాన్ని ప్రదర్శించడంలో ఆయనకి మంచి నేర్పు ఉంది. తాను అనుకున్నది తన అనుచరులతో పూర్తిచేయించే పవర్ఫుల్ విలనిజం కనిపిస్తుంది. ‘దసరా’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఆయన, ఆ సినిమాలో ‘చిన్ననంబి’గా .. నాయికపై కన్నేసే ప్రతినాయకుడిగా చేశాడు. ఈ సినిమా హిట్ కావడంతో ఆయనకి మంచి పేరు వచ్చింది.
ఇక రీసెంట్ గా వచ్చిన ‘రంగబలి’ సినిమాలో ఆయన రాజకీయనాయకుడైన పరశురామ్ గా కనిపిస్తారు. నవ్వుతూనే హీరోకి చుక్కలు చూపించే పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక త్వరలో ఆయన ‘దేవర’ సినిమాలో తెరపై కనిపించనున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలోను చాకో పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడం వలన, చాకో గ్రాఫ్ ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అంటున్నారు. ఈ సినిమాతో తెలుగులో ఆయన మరింత బిజీ అవుతారని చెబుతున్నారు.