నాని విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ.. విజయాలు సాధిస్తున్నాడు. ఇటీవల దసరా అంటూ ఊర మాస్ సినిమా చేశాడు. ఇప్పటి వరకు ఎప్పుడూ నటించనంతగా మాస్ గా నటించాడు. దసరా నానికి మంచి పేరు తీసుకువచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇప్పుడు రూటు మార్చి క్లాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో నానికి జంటగా మృణాల్ ఠాగూర్ నటిస్తుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం.
ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే.. ఇప్పుడు ఈ మూవీ టీజర్ అండ్ టైటిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘నాని మీరు రెడీనా’ అంటూ ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ విడుదల చేయనున్న విషయం తెలియచేశాడు. ఇక టైటిల్ ఏంటంటే.. ‘హాలో డాడీ’ అనే టైటిల్ ఈ సినిమాకు ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ‘హాయ్ డాడీ’, ‘డియర్ డాడీ’, ‘హాలో నాన్న’ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. అయితే.. హాలో డాడీ అనే పేరునే టైటిల్ గా ఖరారు కావచ్చు అంటున్నారు. ఈ సినిమా తండ్రి-కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో సాగనుంది.
ఒక ఎమోషనల్ జర్నీలా ఈ సినిమా ఉంటుంది. నాని కూతురి పాత్రలో కియారా ఖన్నా అనే చిన్నారి నటిస్తోంది. ఈ సినిమా ప్రి టీజర్ చూస్తేనే ఇది తండ్రీ కూతుళ్ల కథ అని అర్థమైపోయింది. కథా కథనాలు హృధ్యంగా.. హృదయానికి హత్తుకునేలా ఉంటాయని.. ఈ చిత్రంతో నాని ప్రేక్షకులను ఏడిపించేయడం ఖాయమని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. చిరంజీవి నటించిన డాడీ సినిమా తరహాలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో కథానాయిక కంటే కూతురి పాత్రే కీలకమట. అందుకే టైటిల్ హాలో డాడీ అని పెట్టాలని చూస్తున్నారట. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.