రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’. దీని గురించి జక్కన్న ఎప్పుడో చెప్పాడు. అంతే కాకుండా.. మహాభారతం తన చివరి చిత్రమని.. ఆ సినిమా చేసిన తర్వాత రిటైర్ అయిపోతానని కూడా చెప్పారు. అయితే.. మహాభారతాన్ని ఎప్పుడో స్టార్ట్ చేస్తారు.. దీనికి ఇంకా చాలా టైమ్ ఉంది అనుకుంటే.. అంత టైమ్ లేదు.. అంటూ విజయేంద్రప్రసాద్ జక్కన్న డ్రీమ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. మహేష్ బాబుతో రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించనున్నారు. వచ్చే సంవత్సరం ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది.
ఈ సినిమా తర్వాత రాజమౌళి చేసే సినిమా మహాభారతమే అంటు క్లారిటీ ఇచ్చారు. అయితే.. మహాభారతాన్ని ఓ పది భాగాలుగా రూపొందించాలి అనుకున్నారు. ఇప్పుడు ఎన్ని భాగాలుగా తీయనున్నారు అనేది తెలియాల్సివుంది. ఇదిలా ఉంటే.. మహాభారతం తెరకెక్కించేందుకు కసరత్తులు మహేష్ బాబు మూవీ తర్వాత స్టార్ట్ చేస్తారనుకుంటే.. ఇప్పటి నుంచే మొదలుపెట్టేశారని వార్తలు వస్తున్నాయి. విషయం ఏంటంటే.. రాజమౌళి ప్రస్తుతం తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. ఈ ట్రిప్ బాగా జరిగిందని.. దేవాలయాల్లోని శిల్ప కళ చూసి ఆశ్చర్యపోయానని.. ఈ ట్రిప్ లో భోజనం కూడా బాగా ఎంజాయ్ చేశానని.. మూడు కిలోలు పెరిగానని సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఈ ట్రిప్ వెనుక మహాభారతం సినిమాకు సంబంధించిన లింక్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. దేవాలయాల్ని సందర్శించినప్పుడు, ఆ ఆలయాల గొప్పదనం, చరిత్ర, శిల్ప కళా నైపుణ్యం వీటి గురించి రాజమౌళి క్షుణ్ణంగా తెలుసుకున్నారని తెలుస్తోంది. అయితే.. మహాభారతం స్క్రిప్ట్ రిసెర్చ్‌లో ఈ పర్యటన కూడా ఓ భాగం అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మొత్తానికి జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసేశారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై జక్కన్న స్పందిస్తారేమో చూడాలి.