తెలంగాణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రంగా ‘రుద్రంగి’ కనిపిస్తుంది. జగపతిబాబు .. విమలా రామన్ .. మమతా మోహన్ దాస్ .. గానవి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణ నేపథ్యంలో .. ఇక్కడ దొరల పాలన .. ప్రజల తిరుగుబాటుకి సంబంధించిన కథా వస్తువుతో ఇంతకుముందు చాలానే సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో కథాకథనాలు ప్రధానంగా కనిపించినప్పటికీ, ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణం జగపతిబాబు విలనిజమే అయింది.
ఈ సినిమాలో జగపతిబాబు ‘భీమ్ రావ్ దేశ్ ముఖ్’ పాత్రలో కనిపించారు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది. ఆయనకి వాడిన కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తాయి. ఇంతవరకూ జగపతిబాబు విలనిజంలో పవర్ఫుల్ డైలాగులు .. గెటప్స్ ప్రధానంగా కనిపిస్తాయి. కానీ ఈ సినిమాలో ఆ రెండింటికీ ఆయన మేనరిజమ్ కూడా తోడైంది. అలాగే ఈ పాత్ర కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్ ను కూడా మార్చుకున్నారు. దాంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గురించి విడుదల తరువాత ఎవరూ మాట్లాడుకోలేదు. జగపతిబాబు విలనిజం వైపు నుంచి ఈ సినిమా ఆశించిన స్థాయి అవుట్ పుట్ ను అందించిందిగానీ, మిగతా అంశాల విషయంలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ ను నడిపించకపోవడమే అందుకు కారణమనే టాక్ వినిపించింది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో కాస్త ఆసక్తిని పెంచి .. అంచనాలను అందుకోలేకపోయిన సినిమాల జాబితాలో ‘రుద్రంగి’ కూడా చేరిపోయింది. అయితే ఈ సినిమా కంటెంట్ ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టే అవకాశం లేకపోలేదు.