Mini Review: “నాకు పెళ్లి అయింది .. నేను నా భర్తతో హాయిగానే ఉంటున్నాను. నువ్వు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకో. నేను హాయిగా ఉన్నానో లేదో నువ్వే ప్రత్యక్షంగా చూడు” అని అని ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో హీరోయిన్ తనని ప్రేమించిన హీరోతో అంటుంది. అతనిని నేరుగా తన ఇంటికి తీసుకుని వెళ్లి తమ మధ్యలో ఉంచుతుంది. మాజీ ప్రేమికుడిని తీసుకుని వెళ్లి తమ కుటుంబ సభ్యుడిలా చేసుకోవడం .. చూసుకోవడం ఆ సినిమాలో హీరోయిన్ కే చెల్లింది. ఇలా జరుగుతుందా? అని ప్రశ్నించుకుంటే .. జరగదు గాక జరగదు. కానీ ఆ సినిమా సూపర్ హిట్.
ఇక ‘బేబి’ విషయానికి వస్తే .. ఇదోరకం కాన్సెప్ట్. కొత్తదనాన్ని వంటినిండా పులుముకుని వచ్చిన కాన్సెప్ట్. హీరోతో టెన్త్ కాల్స్ లో లవ్ లో పడిన హీరోయిన్, ఇంజనీరింగ్ కి వెళ్లేసరికి అక్కడి లైఫ్ స్టైల్ కి కనెక్ట్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోదు. హీరో తన ఆటోలో ఆమె ఫొటో పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటే, ఆమె మాత్రం పబ్బుల్లో తాగేసి సెకండ్ హీరోకి ముద్దులు ఇచ్చేస్తుంది. ఆ మైకం నుంచి బయటపడలేని అతనితో, ఒక నెలరోజుల పాటు డేటింగ్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఆటో ఎక్కగానే మళ్లీ ఫస్టు హీరోతో ప్రేమ ముచ్చట్లు .. కబుర్లు.
ఫస్టు హీరోతో సంతోషంగా ఉండాలి .. అతనితో అందమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి హీరోయిన్ కి ఉంటుంది. అందుకు అడ్డుగా ఉన్న సెకండ్ హీరోను సైడ్ చేయడానికి అతనితో హద్దులు దాటడానికి కూడా సిద్ధపడుతుంది. చెడు దారిలో వెళుతూ అది కూడా భవిష్యత్తులో జరగబోయే మంచి కోసమే అని చెప్పినట్టుగా, సెకండ్ హీరోతో రొమాన్స్ చేయడానికి కారణం, ఫస్టు హీరో పట్ల తనకి గల ప్రేమనే అని తేల్చేశారు. నన్ను నేను మోసం చేసుకున్నాను అంటూ హీరోయిన్ ఏడుస్తుంది .. సానుభూతి చూపేలాగా మళ్లీ మామూలే. ఈ సినిమాలో హీరోయిన్ స్వభావం ఏమిటి? ఆమె ఉద్దేశం ఏమిటి? అనేది అంత తేలికగా అర్థం కాదు. ఒకవేళ అర్థమైతే అంతకుమించిన అదృష్టవంతులు లేరు.