ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని ,శ్రీకాళహస్తిలో సిఐ అంజూ యాదవ్ దానికి భంగం కలిగించారని, శాంతియుతంగా నిరసన చేస్తున్న తమమ పార్టీ నేత కొట్టే సాయిపై అక్రమంగా చేయి చేసుకున్నారని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ క్రమ శిక్షణతోనే ఉంటారని, మచిలీపట్నం సభలో ఈ విషయం రుజువైందని, ఆరేడు లక్షల మంది ఉన్నప్పుడు కూడా జనగణమన మొదలు కాగానే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇది తమ పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. పోలీసు శాఖకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందీ కలిగించలేదన్నారు. పోలీసులకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటుందని, దాన్ని తాము అర్ధం చేసుకుంటామని, కానీ దీన్ని ఓ స్థాయి వరకే భరించగలమని, అడ్డగోలుగా హక్కులను ఉల్లంఘిస్తుంటే తాము ఎదురు నిలబడతామని స్పష్టం చేశారు. పోలీసు శాఖకు తమ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, కానీ ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో తాము ముందుకే వెళ్ళాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ఘటనను మానవ హక్కుల కమిషన్ సుమోతో గా తీసుకోవడంపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. పోలీసు శాఖను ఇష్టారాజ్యంగా వాడుకోవద్దని పవన్ ప్రభుత్వానికి సూచించారు. ఘటనపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారన్నారు.