చిరు వ్యాపారులకు సాయం అందించడంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా కూడా ఇన్ని లక్షల మంది రుణాలు ఇవ్చివడంలేదని. మిగిలిన అన్ని రాష్ట్రాలూ ఎంతమందికి ఇస్తున్నాయో ఏపీలో అంతకంటే ఎక్కువమందికి ఇస్తున్నామని తెలిపారు. వరుసగా నాలుగో ఏడాది.. మొదటి విడతగా జగనన్న తోడు ద్వారా లబ్దిదారులకు సాయం అందించారు.
ఒక్కొక్కరికీ కనిష్టంగా రూ. 10 వేల చొప్పున 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలు… రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి మొత్తం రూ.560.73 కోట్లను క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
పేదలకు మేలు చేసే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ, వాలంటీర్ వ్యవస్ధ, సెర్ఫ్, మెప్మాతో పాటు… రుణాలు అందిస్తున్న బ్యాంకర్లకు సిఎం కృతజ్ఞతలు. తెలిపారు. ఈ రోజు లబ్ధి పొందుతున్న 5.10 లక్షల మందిని కలిపి ఇప్పటి వరకూ 15,87,000 మంది ఈ పథకం ద్వారా మేలు జరిగిందని, రూ.2955 కోట్లు ఇవ్వగలిగామని వివరించారు.
ప్రతి రెండు సచివాలయాలకు చెందిన సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ ఒక బ్యాంకుతో కనెక్ట్ చేసి, చేయి పట్టుకుని నడిపించే మంచి కార్యక్రమమని సిఎం పేర్కొన్నారు. రుణాలు ఇప్పించడంతో పాటు లబ్ధిదారులతో తిరిగి కట్టించడం కూడా ముఖ్యమని సిఎం సూచించారు. బ్యాంకర్లకు నమ్మకం పెరిగే కొద్ది రుణాలు ఎక్కువగా ఇస్తారని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ లబ్దిదారులు ఆయా కలెక్టరేట్ ల ద్వారా సిఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.