గత ప్రభుత్వం ప్రోటోకాల్‌కు విరుద్ధంగా పోలవరం పనులు చేపట్టిందని, ముందుగానే అప్పర్ కాఫర్ డ్యాం నిర్మించారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్ ల గ్యారంటీ పీరియడ్ కేవలం మూడేళ్ళు మాత్రమే నని, ఇప్పటికే ఆ గడువు ముగిసిందని, ఇంకా ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ పూర్తి కాలేదని, దీనికి గత ప్రభుత్వ తప్పిదాలే కారణమని చెప్పారు.
నదిని డైవర్ట్ చేసే పరిస్థితి లేకుండానే… అప్రోచ్ చానల్, స్పిల్ వే, స్పిల్ చానల్ పనులు పూర్తి కాకుండానే లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్ ల నిర్మాణం చెప్పట్టారని తెలిపారు. ఎల్లో మీడియా చెబుతున్నట్లు డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి వరదలు కారణం కాదని, గోదావరికి ఏటా రెండు సార్లు వరదలు వస్తూనే ఉంటాయని, కాఫర్ డ్యామ్ లు కట్టకపోవడమే అసలు కారణమని వివరించారు. పోలవరం ప్రాజెక్టును ముంచింది తాము కాదని, గత ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
చంద్రబాబు కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఘనతే అని చెప్పుకునే వారని… కా కానీ తాము అలా చెప్పడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని ముందుకు వెళితేనే పనులు ముందుకు వెళతాయని చెప్పారు. ప్రాజెక్టులు వీలైనంత త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. గైడు బండ కూలితే బ్యానర్ హెడ్డింగులు పెట్టిన ఓ పత్రిక డయా ఫ్రమ్ వాల్ కూలితే మాత్రం చిన్న వార్తగా రాశారన్నారు.
కృష్ణా నదికి రెండు మూడేళ్ళుగా మంచి నీరు వచ్చిందని, అందుకే పట్టిసీమ ప్రాజెక్టును ఆన్ చేయలేదని, ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు ఆన్ చేస్తామని వివరించారు.