పాకిస్థాన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ (National Assembly) ను రద్దు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కూటమి అధికారంలో ఉంది. ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల రాజ్యాంగ పదవీకాలం ఆగస్టు 12న అర్ధరాత్రితో ముగియనుంది.
దీంతో సార్వత్రిక ఎన్నికలకు అదనపు సమయం పొందేందుకు ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి కొద్ది రోజుల ముందు అంటే ఆగస్టు 8న జాతీయ అసెంబ్లీని రద్దు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాన పాలక సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తొలుత ఆగస్టు 9, లేదా 10 తేదీల్లో పార్లమెంట్ ను రద్దు చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికార కూటమి నేతలతో చర్చించారు. కానీ దిగువ సభను రద్దు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయాలపై సైతం చర్చించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఆగస్టు 8న పాక్ పార్లమెంట్ రద్దు చేయాలని ప్రభుత్వం భావించినట్లు వార్తలు వస్తున్నాయి.
పాక్ రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీని రద్దు చేస్తే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల నిర్ణీత గడువుకు ముందే ప్రభుత్వం కూలిపోతే, లేక పార్లమెంట్ ముందే రద్దయితే పాకిస్థాన్ ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. దీంతో నిర్ణీత కాలానికి ముందే రద్దు చేయడం తమకు కలిసొస్తుందని పీఎంఎల్-ఎన్ నేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ కూటమి భావిస్తోంది.