Saturday, November 23, 2024
HomeTrending NewsManipur: మణిపూర్ లో వెలుగు చూస్తున్న అమానుష ఘటనలు

Manipur: మణిపూర్ లో వెలుగు చూస్తున్న అమానుష ఘటనలు

మణిపూర్‌లో మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు, ఆందోళనల మాటున జరిగిన అమానుష ఘటనలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడి చేసి చంపేసిన ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తాజాగా బయటకు రావడం సంచలనంగా మారింది.

1. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలపై మే 4న లైంగిక దాడి జరిగింది. కాంగ్‌పోక్పీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆ ఇద్దరు మహిళలపై మైతీ వర్గానికి చెందిన అల్లరి మూక బహిరంగంగానే సామూహిక లైంగికదాడికి పాల్పడింది.(ఈ మహిళలనే నగ్నంగా ఊరేగించిన ఘటన వైరల్‌గా మారింది.)

2. మే 4న, ఓ నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులైన 22 ఏండ్ల కుకీ యువతి, ఆమె స్నేహితుడిని 40 మంది మైతీ గ్రూపు.. వేధించడంతో పాటు దాడి చేసింది.

3. మే 5న, కాంగ్‌పోక్పీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏండ్ల వయసున్న ఇద్దరు యువతులపై లైంగికదాడి చేసి, హత్య చేశారు. మైతీ కమ్యూనిటీకి చెందిన కొంతమంది దుండుగులు, ఇంఫాల్‌లో కోనుంగ్‌ మమాంగ్‌ ఏరియాలో రెండున్నర గంటల పాటు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. తర్వాత గది తెరిచి చూస్తే, ఇద్దరు యువతులు రక్తపు మడుగులో ఉన్నారు.

4. మే 15న, ఇంఫాల్‌లోని ఓ ఏరియాలో మైతీ మూక ఓ 18 ఏండ్ల యువతిని అపహరించింది. ప్రతిఘటించే సరికి, ముక్కలుగా నరికేస్తామని దుండుగులు బెదిరించారు. అనంతరం బాధిత యువతికి నాగాలాండ్ రాజధాని కోహిమాలో ఓ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించగా లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ అయింది.

మహిళల వివస్త్ర ఘటన తర్వాత మణిపూర్‌ హింసకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఓ వ్యక్తి తలను నరికి, వేలాడదీసిన వీడియో వైరల్‌గా మారింది. బాధితుడ్ని కుకీ తెగకు చెందిన డేవిడ్‌ థీక్‌గా గుర్తించారు. జూన్‌ 2న బిష్ణుపూర్‌ జిల్లాలోని ఓ ఏరియాలో జరిగిన ఘర్షణల్లో చనిపోయిన ముగ్గురిలో డేవిడ్‌ ఒకరుగా తెలుస్తున్నది.

నెల క్రితం అందిన ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్‌ ఇప్పటివరకూ స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై ఎన్‌సీడబ్ల్యూకి ఫిర్యాదు చేసే ముందు ఇద్దరు సామాజిక కార్యకర్తలు, నార్త్‌ అమెరికన్‌ మణిపూర్‌ ట్రైబల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బాధిత మహిళలతో మాట్లాడారు. ఫిర్యాదు తర్వాత మహిళా కమిషన్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదని వారు ఆరోపించారు. ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తాజాగా దీనిపై స్పందిస్తూ.. తమకు గత మూడు నెలలుగా మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర యంత్రాంగానికి పంపామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అంతకుముందు మే 29న కూడా ఓ మహిళా సంఘం నుంచి ఫిర్యాదు వచ్చిందని.. తాజాగా వీడియో వైరల్‌ అయిన తర్వాత ఆమె వెల్లడించడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్