జూలై 25 వరకు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఢిల్లీకి మరింత వరద ముప్పు పొంచి ఉన్నట్లయింది. గత కొన్నిరోజులుగా ఢిల్లీలో యమునా నది 205.33 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. శనివారం నదీ ప్రవాహం ప్రమాద స్థాయికి తగ్గినప్పటికీ.. మళ్లీ పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 13న యమునా నది 208.66 మీటర్లు ప్రవహించింది.
మరోవైపు గుజరాత్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్ ఏరియాలతోపాటు రన్‌వే పైకి కూడా వరద నీరు వచ్చి చేరింది.
ప్రయాణికులు సమయానికి తమ ఫ్లైట్‌ను చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మోకాళ్ల లోతు నీళ్లలో ప్రయాణికులు అటూ ఇటూ నడవాల్సి వస్తున్నది. ఎయిర్‌పోర్టులోంచి వరద నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత 28 ఏళ్లలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టును వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని వారు తెలిపారు. గత 48 గంటల నుంచి గుజరాత్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.