Saturday, November 23, 2024
HomeTrending NewsTS Highcourt: తెలంగాణ ఆరో చీఫ్ జస్టిస్ గా అలోక్‌ అరాధే

TS Highcourt: తెలంగాణ ఆరో చీఫ్ జస్టిస్ గా అలోక్‌ అరాధే

తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, ఎంపీ కే.కేశవరావు, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌ పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్‌ అరాధేను నియమించారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తర్వాత జస్టిస్‌ అరాధే ఆరో సీజే. సీఎం కేసీఆర్‌ నూతన సీజేకు పుశ్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

జస్టిస్‌ అలోక్‌ అరాధే.. 1964, ఏప్రిల్‌ 13న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జన్మించారు. 1988, జూలై 12న న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించారు. 2009 డిసెంబర్‌ 29న మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2016, సెప్టెంబర్‌ 16న జమ్ముకశ్మీర్‌ న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2018లో మూడు నెలలపాటు జమ్ముకశ్మీర్‌ తాత్కాలిక సీజేగా బాధ్యతలు నిర్వహించారు. 2018, నవంబర్‌ 17 నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలం కర్ణాటక తాత్కాలిక సీజేగా కూడా పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్