Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపార్లమెంటు స్థాయీ సంఘం సిఫారసు

పార్లమెంటు స్థాయీ సంఘం సిఫారసు

No Return: ఇంగ్లీషులో అవార్డు అనే మాటకు పురస్కారంతో పాటు విధించడం, తీర్పు ఇవ్వడం అని కూడా విస్తృత అర్థాలున్నాయి. మాట్లాడే మాటలన్నిటికీ భావార్థాలు వెతుక్కుంటూ పోతే…వెయ్యేళ్ల ఆయుస్సు ఉన్నా సగం పదాలను కూడా పూర్తి చేయలేం. ఎప్పుడయినా, ఎవరికయినా గుర్తింపు ముఖ్యం. ప్రశంస, అభినందన, సన్మానం, పదోన్నతి, నగదు బహుమతి, బిరుదు ప్రదానం…అన్నీ గుర్తింపులో ప్రధానమే.

అవార్డులు ఎన్ని రకాలు? ప్రభుత్వ, ప్రయివేటు అవార్డులు గ్రహించడానికి (గ్రహించడం మాటకు వ్యుత్పత్తి అర్థం ‘తీసుకోవడం’ అనే పాజిటివ్ మీనింగ్ తో పాటు ‘లాక్కోవడం’ అనే నెగటివ్ మీనింగ్ కూడా ఉండడం ఇక్కడ అనవసరం) అర్హతలు ఏమిటి? పనిచేస్తే వాటంతటవే వచ్చే అవార్డులు; పైరవీలు చేసుకుంటే వచ్చే అవార్డులు; డబ్బు ఖర్చు పెట్టుకుంటే వచ్చే అవార్డులు; భావజాల అవార్డులు, రాజకీయ అవార్డులు; సభా మర్యాద దృష్ట్యా చెప్పకూడని కొన్ని విద్యలతో తెచ్చుకునే అవార్డులు…ఇలా అవార్డుల స్వరూప స్వభావాలు, వాటిని పొందే పద్ధతుల మీద అవార్డుల కోసం ప్రయత్నించేవారికి జ్ఞానం ఉన్నట్లే ఆయా అవార్డులు వారికి ఎలా వచ్చాయో అన్న స్పష్టత లోకానికి కూడా ఉంటుంది.

అవార్డులు ఎంతో విలువయినవి. అందువల్ల చాలా సార్లు అవార్డులకు లెక్కలేనంత విలువ చెల్లిస్తూ ఉంటారు. ఇంతకంటే లోతుగా వెళ్లడం భావ్యం కాదు.

బిరుదులు ఒకరు ఇవ్వకపోయినా మనకు మనమే పెట్టేసుకోవచ్చు. ఇంటిపేరు కంటే ఘనంగా వాటిని ముందు తగిలించుకోవచ్చు. కీర్తి కిరీటాలు, భుజ కీర్తులు, ముంజేతి కంకణాలు, పాదుకా పట్టాభిషేకాలు, గజమాలలు, దుశ్శాలువలు, గజారోహణలు, సన్మాన పత్రాలు, పుష్పాభిషేకాలు అనాదిగా ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి. ఇందులో అక్కడక్కడా స్వరూపం మారుతుంది కానీ…స్వభావం మాత్రం మారదు.

గౌరవ డాక్టర్లు పెరిగే సరికి అసలు డాక్టర్లు తమను తాము ఎలా పిలుచుకోవాలో మరిచిపోయారు.

“అవార్డు వాపసీ” అని ఆ మధ్య చాలా మంది పెద్దవారు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చారు. ఇందులో నిజంగా అవార్డు బొమ్మను, మెడల్ మెడ బిళ్లను, ధ్రువపత్రాన్ని, ఆ అవార్డు వల్ల వచ్చిన ప్రత్యేక వసతులను వెనక్కు ఇచ్చేసిన వారెందరో? “వాపసీ” ప్రకటన చేసి ఇళ్లల్లో అవార్డులను అలాగే గోడలకు తగిలించుకున్నవారెందరో? ఇదమిత్థంగా లెక్కలు లేవు. కొన్ని రుతువుల్లో కొన్ని సహజం. చైత్రంలో చెట్లు చిగురించాలి. గ్రీష్మంలో ఆకు రాలాలి. అలా అవార్డు వాపసీ ఒక రుతువు. ఆ రుతువులో జరగాల్సింది ఆ రుతువులోనే జరుగుతుంది.

కుడి చేత్తో ఇచ్చిన అవార్డును ఎడమ చేత్తో వెనక్కు ఇచ్చినట్లు ఎడమ చూపువారే…అది కూడా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎందుకు వెనక్కు ఇస్తున్నారో అన్నది మరో చర్చ.

అవార్డు వాపసీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దాంతో ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలంటే ఏమి చేయాలో సూచించాల్సిందిగా పార్లమెంటులో జరిగిన చర్చ నేపథ్యంలో స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. స్థాయీ సంఘం చర్చించి…చర్చించి… పార్లమెంటుకు కొన్ని సిఫారసులు చేసింది. అందులో అత్యంత కీలకమయిన సూచన:-
“కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ అకాడెమీలు అవార్డులు ప్రకటించడానికంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో అవార్డును వెనక్కు ఇవ్వనని ఆ అవార్డు అందుకోబోయే వ్యక్తుల దగ్గర తప్పనిసరిగా ఒక లిఖితపూర్వక హామీని తీసుకోవాలి” అని.

పార్లమెంటు టేబుల్ ను తాకిన ఈ స్థాయీ సంఘం సూచనను పార్లమెంటు చర్చించి ఆమోదిస్తుందా? తిరస్కరిస్తుందా? సవరిస్తుందా? లేక అనేక స్థాయీ సంఘం సూచనల్లా చర్చకే రాకుండా పార్లమెంటు లైబ్రరీ కాలగర్భంలో కలిసిపోతుందా? అన్న విషయం మీద స్పష్టత లేదు.

నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును కూడా కాలరాసే హామీ పత్రం రాసిమ్మని ప్రజాస్వామ్య అత్యున్నత దేవాలయమయిన పార్లమెంటులోనే సూచనలు చేసే స్థాయికి మన ప్రజాస్వామ్య ప్రయాణం ఎగబాకిందా? లేక దిగజారిందా? అన్నదే చర్చించాల్సిన అసలు విషయం.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్