Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

A Book to keep…: ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వేల జాతులకుపైగా పక్షులున్నాయి. వీటిలో మన భారత ఉప ఖండంలోనే పదమూడు వందల రకాలుండటం విశేషం. ఇవి అతిచిన్న పరిమాణం నుండి ఆరు అడుగుల వరకూ ఉన్నాయి. ప్రతి ఏడాది మే నెల రెండవ శనివారం అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం నిర్వహిస్తుంటారు.

పక్షిలా స్వేచ్ఛగా ఎగరాలనే ఆశ ఉండటం తప్పేమీ కాదు. కానీ ఆ పక్షుల గురించి ఏ మేరకు తెలుసు అని ఎవరైనా అడిగితే సరైన జవాబు చెప్పలేం. దిక్కులు చూస్తాం. ప్రకృతిని ప్రేమించగలిగిన వారు పక్షులనూ ప్రేమిస్తారు. మనమందరం ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూస్తూ ఉంటాం. అయితే నీటి లోపల కూడా ఎగిరే పక్షులను చూసి ఉండం. సముద్రంలోకి దిగి శ్వాసను బిగబట్టి లోపలకు చూస్తే అక్కడ అనేక పెంగ్విన్ పక్షులను ఎగురుతుండటం చూడవచ్చు. నిజానికి పెంగ్విన్ ఎగరలేదు. కానీ ఆకాశంలో ఎగరడానికి ఉపయోగపడని తన రెక్కలను తెడ్డులా ఉపయోగించుకుంటూ నీటి లోపల ఈతకొట్టడాన్ని చూస్తుంటే నీటిలో అవి ఎగురుతున్నట్టే అనిపిస్తుంది. అలాగే బాబిన్ అనే ఓ పక్షి నీటిలోపల ఈత కొట్టడం చూస్తుంటే ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. పెంగ్విన్ గురించి ఇంకొక విషయం తెలుసా…పెంగ్విన్ ఒకే ఒక్క గుడ్డు పెడుతుంది. గుడ్డును పెట్టడంతో ఆడ పెంగ్విన్ పని పూర్తయిపోతుంది. ఆ గుడ్డుని కంటికి రెప్పలా చూసుకుని పొదిగే బాధ్యతంతా మగ పెంగ్విన్ దే.

మన దేశంలోని ఉత్తర ప్రదేశ్ లో హరియాల్ అనే పక్షిని నేల మీద చూడలేం. కారణం అవి ఎత్తయిన చెట్లలో ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాయి. చెట్ల నుంచి ఇవి భూమ్మీదకు దిగి రావడానికి ఇష్టపడవు. ఇవి మన దేశంలోనే కాకుండా శ్రీలంక, బర్మా, చైనా, నేపాల్, పాకిస్తాన్ తదితర దేశాలలోనూ ఉన్నాయి. ఇక వడ్రంగి పిట్ట జాతిలో రెండు వందల రకాలకుపైగా ఉన్నాయి.

వివిధ రంగుల్లో, వివిధ తీరుతెన్నుల్లో, వివిధ అమరికలతో కూడిన పక్షుల గురించి ఒకటా రెండా…లెక్కలేనన్ని విశేషాలు చెప్పుకోవచ్చు. ఏ జాతి పక్షులు వాటి ప్రత్యేకతను చాటుకునే రంగులతో ఎలా ఉంటున్నాయన్న దానిపై పరిశోధనలు చేసిన వారున్నారు. కొన్ని పక్షులు తేలికపాటి రంగుల్లో ఉంటే మరికొన్ని ముదురు రంగుల్లో ఉంటాయి. కొన్ని పక్షులు అందవికారంగా ఉంటే మరికొన్ని అద్భుతమైన అందాలను సొంతం చేసుకుంటాయి. ఈ తేడాలు ఎందుకనే దానిపై కూడా అధ్యయనం చేసిన వాళ్ళున్నారు. పక్షుల ఈకల్లో రెండు రకాలుగా ఉండే పిగ్నెంటేషన్ వల్ల ఆయా వర్ణాల తీరు ఉంటుందని కనుగొన్నవాళ్ళూ ఉన్నారు. మెలనిన్ అనే పదార్థం వల్ల ఈకల్లో రకరకాల రంగులు ఏర్పడతాయని ఓ నిర్థారణకు వచ్చారు.

పక్షుల కాళ్లను నిశితంగా పరిశీలిస్తే ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణాన్ని చూడవచ్చు. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కింద పడకుండా కాపాడుతుందని పరిశోధకుల మాట.

ఇలా పక్షుల ప్రపంచం గురించి అనేకానేక విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. అటువంటి అందమైన పక్షుల ఫోటోలతో చూడముచ్చటగా రూపొందించిన పుస్తకాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందుకున్నాను. ఈ పుస్తకం పేరు బర్డ్స్ బ్యూటిఫుల్…శీర్షికకు తగినట్టే అందమైన పుస్తకం ఇది. కారణం, పుస్తకమంతా వివిధ పక్షులతో వర్ణమయమవడమే.

కంభంపాటి సీత, సోమంచి శ్రీనివాసరావు దంపతులు తమ కెమెరాలతో క్లిక్కుమనిపించి సింగారించిన రకరకాల పక్షుల సమాహారమే ఈ పుస్తకం. ఇద్దరూ అధ్యాపక వృత్తిలో ఎందరినో తీర్చిదిద్దినవారే. పదవీ విరమణ తర్వాత కెమేరాలు భుజం మీద వేసుకుని కొండలనూ గుట్టలనూ పలకరిస్తూ కళ్ళకు కనిపించే పక్షులు చిన్నవైనా పెద్దవైనా అరుదైనవీ ఫోటోలు తీసి వాటిని పదిలపరచడం విశేషం.

మన దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడమే కాకుండా విదేశాలలోనూ పర్యటించి ఇప్పటికి లక్షకు పైగా ఫోటోలను తీశారు. వాటిలో కొన్నింటిని ఎంపిక చేసి 260 పేజీలలో ఎ. గిరిధర్ (విజయవాడ) గారితో ముస్తాబు చేయించారు. ఈ ఫోటోలను చూసిన వారి మనసు పరవశిస్తుందనడం అతిశయోక్తి కాదు.

రెడీ స్టెడీ…స్మయిల్ ప్లీస్ …అంటూ మనుషులకు చెప్పినట్టు చెప్పి ఫోటోలు తీయడానికి పక్షులు మనిషి కావుగా. వాటిని ఫోటో తీయడానికి నేర్పు ఓర్పు తప్పనిసరి. ఒక్కొక్కప్పుడు గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. అటువంటప్పుడు విసుగేస్తుంది. కానీ వీరి పెట్టుబడి “ఓర్పే” అనడానికి ఈ పుస్తకం ఓ గొప్ప సాక్ష్యం.

పక్షులను ఫోటోలు తీయడం అంత సులభం కాదు. అవి ఎంత స్వేచ్ఛా జీవులో అంతే చిలిపివి. అల్లరివి. నవ్విస్తాయి. కవ్విస్తాయి. ఏడిపిస్తాయి. విసిగిస్తాయి. ఒకటేమిటీ వాటితో ప్రయాణించడం మామూలు విషయం కాదు. కానీ వీరి పనితనమంతా ఈ పుస్తకంతో అంచనా వేయొచ్చు. ప్రతి పక్షికి వాడుకలో ఉన్న పేరుతో పాటు శాస్త్రీయ నామాన్ని కూడా ఎక్కడికక్కడ ఇస్తూ వాటిని కెమెరాలో బంధించడానికి ఉపయోగించిన సాంకేతిక విషయాలనూ పొందపరచడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ అధ్యక్షుడు తమ్మా శ్రీనివాసరెడ్డి గారి ముందుమాట “బ్యూటిఫుల్ బుక్ ఆన్ బర్డ్స్ బ్యూటీ” పక్షులంత అందంగా ఉంది.

ఈ పుస్తకం వివరాలకోసం 72078 55830, 94405 87580 అనే ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చు.

(ప్రస్తుతం హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతున్న నేపథ్యంలో ఆసక్తి ఉన్నవారు ఈ పుస్తకాన్ని, లభ్యతను అడిగి కొనుగోలు చేయవచ్చు.. ఇలాంటి బుక్ మనదగ్గరుంటే మనసంతా ఆహ్లాదమే)

– యామిజాల జగదీశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com