Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతాగకపోతే బెల్ట్ తీస్తాం!

తాగకపోతే బెల్ట్ తీస్తాం!

Open Warning:  ముందు ముందు రోగానికి మందులు దొరక్కపోయినా…నిషా మందుకు మాత్రం ఢోకా ఉండదు. మద్యానికి “మందు” అన్నమాట ఎలా అన్వయమవుతుందో నాకు అర్థం కాదు. ఆ మాటకు వ్యుత్పత్తి అర్థాన్ని సాధించడానికి నాకున్న ఆవగింజంత భాషా పరిజ్ఞానం చాలదు. తాగినవారి మాటలకు అర్థం ఎలా ఉండదో! మందు అన్న మాటకు అన్వయం కూడా అలాగే ఉండదు అనుకుని మౌనంగా ఉండడం ఒక పద్ధతి. బాగా గాయాలయినప్పుడు విశ్రాంతి కోసం మత్తు మందు- ఇంజెక్షన్ లేదా స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చినట్లు ఒకప్పుడు నిజంగానే మద్యాన్ని మందుగా వాడడం వల్ల…మాటకు అర్థవ్యాప్తిలో ఆ మందును ఈ మందుకు లోకం ముడిపెట్టుకుని ఉండవచ్చు అనుకోవడం మరో పద్ధతి. మందులు వేసుకోవడానికి తగిన రోగాలను ప్రసాదించే ద్రవం కాబట్టి ఇదే అసలయిన మందు అన్న తాత్విక అర్థమేదో ఉండి ఉంటుందనుకోవడం అన్నిటికన్నా ఉత్తమమయిన పద్ధతి.

అయినా…మందు భాషకు ఏ సాధారణ వ్యాకరణ సూత్రాలు; భాషా నియమాలు; ఉచ్చారణ సంప్రదాయాలు, భాషోత్పత్తి నిర్ణయాలు; వ్యవహార సిద్ధాంతాలు పనిచేయవు.

మందు దానికదిగా ఒక భాష. ఒక యాస. ఒక ద్రవ ధ్వని. ఒక చుక్కల అలంకారం. ఒక సీసాలో ఒదిగిన రస భావం. ఎంతగా తడబడినా…ఒక నడక. ఎంతగా తూలిపడినా…ఒక ఛందస్సు. ఎంతగా వాంతి చేసుకున్నా...ఒక భావం పొంగు. ఎంతగా కళ్లు మూతలు పడినా…ఒక ఆనంద రస సిద్ధి. తాగి ఎంతగా తన్నుకున్నా…ఒక ఆత్మీయ ఆవిష్కార ప్రతీక. తాగి ఎన్ని ప్రాణాలు తీసినా…ఒక అసంకల్పిత ప్రమాదం.

లక్ష రూపాయల నగదు చేయలేని పనిని వెయ్యి రూపాయల బాటిల్ చేయగలదు అన్నది అనుభవజ్ఞుల మందు నీతి.

ఆనందానికి- మందు.
విషాదానికి- మందు.
పెళ్లికి- మందు.
చావుకు- మందు.
కలయికకు- మందు.
వీడ్కోలుకు- మందు.
ఉబుసుపోకకు- మందు.
ఊరికే- మందు.
డబ్బుకు- మందు.
మందుకు- మందు.
ముందుకు- మందు.
వెనుకకు- మందు.
పక్కకు- మందు.
పైకి కైపెక్కడానికి- మందు.
పైకి పోవడానికి- మందు.
కింద పడ్డానికి- మందు.
లేవలేక- మందు.
ఏడవలేక- మందు.
ఏడుస్తూ- మందు.
మర్యాదకు- మందు.
అమర్యాద- మందు.
ఆతిథ్యానికి- మందు.

మందుకు ఒక సమయం, సందర్భం, ముహూర్తం అంటూ ఏమీ ఉండదు. మందే ఒక సమయం. మందే ఒక సందర్భం. మందే ఒక ముందొచ్చిన, ముద్దొచ్చే ముహూర్త సందర్భం.

ఎంత రాతి గుండెలయినా బాటిల్ ను చూడగానే కరిగి చుక్కలు చుక్కలు కావాల్సిందే.

బయట వ్యవహారంలో ఒకరినొకరు కొట్టుకుంటే…ఫలానా ఆయన ఫలానా ఆయన్ను కొట్టాడు అంటారు. “వారు మందు కొట్టారు” అని మద్యం తాగడానికి మాత్రమే వాడే ఒక భాషా నియమం ఎలా పుట్టిందో నాకు అంతుబట్టడం లేదు. నేను మందు కొట్టకపోయినా… కొన్ని వేల మందు కొట్టుడు పార్టీల్లో చూశాను కాబట్టి…బహుశా మద్యం తాగడానికి ముందు మందు బాటిల్ ను చేత్తో తడతారు లేదా కొడతారు…అందువల్ల ఆ కొట్టడం కాస్త “మందు కొట్టడం” అయి ఉండాలని నా ఊహ. లేదా…మెడిసిన్ మందు, మద్యం మందు మధ్య తేడా తెలియాలని ఏ పుణ్యపురుషులో “మందు కొట్టడం” అన్న మాటను కనుక్కుని పుణ్యం కట్టుకుని ఉండాలి. అందువల్ల మనం ఆసుపత్రి మందులు వేసుకుంటామే కానీ…కొట్టం. లిక్కర్ మందు కొట్టాక…ఆసుపత్రి మందు కొట్టకపోయినా…వేసుకో! అని లోపల లివర్ పిలుస్తూనే ఉంటుంది. అది వేరే విషయం!

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గానుగపాడులో దండోరా వేశారు. దాని సారాంశం ఏమిటంటే-
” మా బెల్ట్ షాపులోనే ఊరి జనం మద్యం కొనుక్కుని తాగాలి. ఫలానా బెల్ట్ షాపులో కొనుక్కుని, మందు కొట్టినట్లు తెలిస్తే…అయిదు వేల రూపాయలు జరిమానా విధిస్తాం. ఖబడ్దార్

“వారి బెల్ట్ షాపులో మద్యం తాగితే బెల్ట్ తీస్తాం…ఏమనుకుంటున్నారో!”
అని అంతకు ముందు వీరు కూడా చాటింపు వేశారట!

ఆహా!
…ఇది వింటుంటే గొంతులో చిల్డ్ బీర్ చల్లగా, మెల్లగా చుక్క చుక్క దిగుతున్నట్లు ఎంత హాయిగా ఉందో కదా?
రెడ్ వైన్ మెల్లగా మత్తు ఎక్కిస్తున్నట్లు కిక్కుగా ఉంది కదా?
ఓల్డ్ మాంక్ న్యూ ఫిలాసఫీ చెబుతున్నట్లు వీనులవిందుగా ఉంది కదా?
డైరెక్టర్స్ స్పెషల్ త్రీ డి దృశ్యం కనిపిస్తోంది కదా?
బ్యాగ్ పైపర్స్ కోటి గొట్టాలు ఒకేసారి గుండెలో మోగినట్లు చెవులకు ఇంపుగా ఉంది కదా?
ప్రజాస్వామ్య దేశంలో అత్యంత పారదర్శకతకు వేసిన బ్లాక్ లేబుల్ లా ఉంది కదా?

శ్రీశ్రీ అన్నాడు-
“శేషేన్‌ శేషేన్‌!
నీ పొయెమ్సు చూసేన్‌
అవి బహు పసందు చేసేన్‌
అది పద్యమా!
ఫ్రెంచి మద్యమా!”

గోదావరి అంటోంది-
“గానుగపాడు మద్యమా!
అది ఫ్రెంచి పద్యమా?”

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్