Wednesday, May 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅవతరించెను... అంతలోనే అంతర్ధానమయ్యెను...

అవతరించెను… అంతలోనే అంతర్ధానమయ్యెను…

Fake Baba: “కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా… గోచిగుడ్డ నుండి మొదలయిన అంతులేని మహా సంసార ప్రయాణం కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే.

ఒకానొక ఊరు. పంటపొలాలతో, ధన ధాన్యాలతో పచ్చగా, హాయిగా ఉంది. ఊరిని ఆనుకుని ఊరికి కొండగుర్తుగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక శిథిలాలయ మంటపం. ఎక్కడ నుండి, ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ…ఒక సన్యాసి వచ్చి ఆ మంటపం కింద గూడు కట్టుకున్నాడు. పశువుల కాపర్లు ఎవరయినా కొండమీదికి వెళ్లినప్పుడు తాము తెచ్చుకున్న సద్ది మూట విప్పి ఓ ముద్ద పెడితే తింటాడు. పెట్టకపోతే పెట్టాలని చేయి చాచి అడగడు. వచ్చినవారే దయదలిచి ఒక కాయో పండో ఇచ్చి వెళ్లేవారు.

సన్యాసికి ఒంటి మీద ఒక గోచీ గుడ్డ, కొమ్మకు ఆరేసుకున్న మరో గోచీ గుడ్డ తప్ప ఇంకెలాంటి స్థిర చరాస్తులు లేవు. ఉండాలని కోరుకోలేదు. కాలం అలా గడిచిపోతూ ఉంటే కాలం ఎందుకవుతుంది?
ఆరేసుకున్న గోచీ గుడ్డను ఎలుకలు కొరకడంతో సన్యాసికి ఎక్కడలేని కష్టాలు మొదలయ్యాయి. సర్వసంగ పరిత్యాగి ఈ విషయం మీద లోలోపల చాలా నలిగిపోతున్నాడు. ఒక శుభ ముహూర్తాన తన బాధను పశుల కాపర్లతో పంచుకున్నాడు. అయ్యో స్వామీ! ఇదా మీ బాధ? అందుకా ఈ మధ్య దిగులు దిగులుగా ఉన్నారు? రేప్పొద్దున కొండ మీదికి వచ్చేప్పుడు ఒక పిల్లిని తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళతాం. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అన్నారు. అన్నట్లుగానే పొద్దున్నే చంకలో పిల్లిని పెట్టుకుని వెళ్లారు. సన్యాసి రెండ్రోజులు గమనించాడు. ఎలుకలు మాయం. గోచీ గుడ్డ భద్రం.

అయితే ఆ కొండమీద సరయిన ఆహారం దొరకక పిల్లి మూడో రోజుకు కళ్లు తేలేసింది. సన్యాసి మనసు చివుక్కుమంది. మళ్లీ పశుల కాపర్లనే సలహా అడిగాడు. ఒంటరి పిల్లి బిక్కు బిక్కుమంటూ ఉంది. పైగా పిల్లికి పాలు పోయాలి…అని రెండో పిల్లిని కూడా ప్రవేశపెట్టారు. పాల క్యాన్, గిన్నెలు, ప్లేట్లు ఎలాగూ ఉంటాయి. వారం తిరగ్గానే సన్యాసి మళ్లీ మొహం వేలాడేసుకుని ఉండడాన్ని పశుల కాపర్లు జీర్ణించుకోలేకపోయారు. ఏమి స్వామీ! ఏమయ్యింది? అని అడిగారు. జంట పిల్లులు మ్యావ్ మ్యావ్ అని నా దుంప తెంచుతున్నాయి…అని బాధపడ్డాడు. మరుసటి రోజు ఉదయాన్నే రెండు అడవి కుక్కలను ప్రవేశపెట్టారు. తోడుగా రెండు ఆవులను కూడా ముందు జాగ్రత్తగా తెచ్చి కట్టి పడేసి, ఒక గుడిసె, పందిరి వేసి పెట్టారు.

సన్యాసి ఇవన్నీ చూసుకోలేక తపస్సు దారి తప్పుతోందని గ్రహించి ఊళ్లో ఈ విద్యలన్నీ తెలిసిన ఒక అనాథ యువతిని కొండమీద ఆశ్రమంలో ప్రవేశపెట్టారు. ఒకానొక కారు చీకటి కమ్మిన వేళ ఆ యువతిలో సన్యాసికి కాంతి రేఖ కనిపించింది. అంతే పెళ్లి కాకుండానే శోభనం జరిగిపోయింది. విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు పంచాయతీ పెట్టి శాస్త్రోక్తంగా పెళ్లి చేశారు. ఇంత సంసారంతో ఈ కొండమీద ఉండలేను…కొండ దిగి ఊళ్లోకి వచ్చేస్తాను అని సంసారిగా మారిన సన్యాసి చేసిన డిమాండును ఊరి జనం పెద్ద మనసుతో అంగీకరించారు. ఊరవతల అవుటర్ రింగ్ రోడ్డును ఆనుకుని సరికొత్త సంసారి సువిశాలమయిన గృహాశ్రమం కట్టుకుని పిల్లాపాపలతో, గొడ్డూ గోదాతో హాయిగా కాలం గడపసాగాడు. ఈ సన్యాసి సంసారిగా ఎందుకు మారాడు అని ఎవరయినా అడిగితే…ఆరోజు నుండి “కౌపీన సంరక్షణార్థం” అని సమాధానం వస్తోంది. కౌపీనం అంటే గోచీ గుడ్డ. సంరక్షణార్థం అంటే రక్షించుకోవడానికి. గోచీ గుడ్డను రక్షించుకోవడానికి జరిగిన సన్యాసి పరిణామక్రమ సిద్ధాంతమిది.

ఇప్పుడు ఈ కథను ప్రస్తుతానికి అన్వయించుకోండి. గోచీ గుడ్డ, ఎలుక, పిల్లి, కుక్క, ఆవు, పందిరి, పరిజనం, భజన, పరవశం, సన్యాసి సంసారం…సభామర్యాద దృష్ట్యా చెప్పకూడని ఇంకా ఎన్నెన్నో విషయాల్లో కౌపీన సంరక్షణార్థం సందర్భాలే. అవే పాత్రలు. అవే ఘటనలు. అవే దిగజారుళ్ళు. అంతా సేమ్ టు సేమ్. జస్ట్ నేమ్స్ ఛేంజ్డ్.

తాజాగా తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో ఒక అవతారపురుషుడు ఆవిర్భవించాడు. తమిళనాడునుండి ఎప్పుడో వచ్చి…ఏ పనీ చేతకాక…ఏ పని చేపట్టాలో తెలియక…ఒక స్వామిగా తనను తానే ఆవిష్కరించుకున్నాడు. సందుకో స్వామి పుడుతూనే ఉన్నా...140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా స్వాముల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి…స్వాములది ప్రామిసింగ్ బిజినెస్ కాబట్టి...ఇతడు విష్ణుస్వామిగా మారాడు. విష్ణువు ఆదిశేషుడి పడగ కింద పడుకోవాలి కాబట్టి…ఒక చెక్క మంచం తలాపున కంచుతో ఆదిశేషుడి పడగను బిగించుకున్నాడు. విష్ణువుకు శ్రీదేవి, భూదేవి కాళ్లు ఒత్తుతుంటారు కాబట్టి…ఇద్దరిని కాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు. నెత్తిన కిరీటం. ముక్కు మధ్య వరకు నామాలు…ఇతర ఆంగికాభినయాలు అలవాటు చేసుకున్నాడు. ఈలోపు ఊళ్లో మెదడున్న కొంత మందికి అవతారపురుషుడి అవతారాల వెనుక అంతరార్థాలు, ఆయన మాటల్లో ప్రతిసారీ పదార్థాల ప్రస్తావన వెనుక ప్రతిపదార్థాలు అర్థమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా అవతార పరిసమాప్తి జరిగింది!

దేవుడా రక్షించు నాదేశాన్ని పవిత్రులనుండి ; పతివ్రతలనుండి ;
పెద్దమనుషులనుండి ;
పెద్ద పులులనుండి ;
నీతుల రెండు నాల్కలుసాచి బుసలుకొట్టే నిర్హేతుకకృపాసర్పాలనుండి ;
లక్షలాది దేవుళ్ళనుండి ;
వారిపూజారులనుండి ;
వారి వారి ప్రతినిధులనుండి;
సిద్ధాంతకేసరులనుండి ;
సిద్ధులనుండి ;
శ్రీమన్మద్గురు పరంపర నుండి . . .”
అని దేవరకొండ బాలగంగాధర తిలక్ ఎనభై అయిదేళ్ల కిందట అన్నాడు. ఆ సంగతి మనకెందుకు?

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్