Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరౌడీషీటర్ ను తెలుగులో ఏమంటారు?

రౌడీషీటర్ ను తెలుగులో ఏమంటారు?

True Translation: లంక అశోకవనంలో ఒకరోజు సూర్యోదయానికంటే ముందే తాగిన మత్తులో వచ్చిన రావణాసురుడికి గడ్డి పెట్టడానికి సీతమ్మ లిటరల్ గా గడ్డిపోచను అడ్డుపెట్టి ఒక మాట చెబుతుంది.

నీ కొలువులో మంచి చెప్పేవారు లేరా? లేక చెప్పినా నువ్ వినవా? అన్నది సీతమ్మ ప్రశ్న.

నాకు మంచి తెలుసు- చేయను;
చెడు తెలుసు- చేయకుండా ఉండలేను.
“స్వభావో దురతిక్రమః”
నా స్వభావం ఇంతే. మార్చుకోలేను-
అన్నది రావణాసురుడి పది తలలపొగరు సమాధానం.

అయితే నీ చావుకు నువ్వే ముహుర్తాన్ని దగ్గరికి జరుపుకుంటున్నావు…అలాగే చావు-
అన్నది సీతమ్మ హితబోధ.

స్వభావమే వ్యక్తిత్వం. ఎవరికి వారు తప్పు తెలుసుకుని మార్చుకోవచ్చు. ఎదుటివారు చెబితే మారవచ్చు. భయానికో, భక్తికో…కారణమేదయినా…ఏదో ఒక దశలో మారవచ్చు.

న్యాయస్థానాల్లో నేరం రుజువై…శిక్ష అనుభవించే ఖైదీల్లో కూడా సత్ప్రవర్తన తీసుకురావడానికి జైళ్లు చేయని ప్రయత్నం లేదు. మారి…మంచి నడవడికతో శిక్ష తగ్గి…బయట మళ్లీ కొత్త జీవితం ప్రారంభించేవారు కూడా ఉంటారు.

ఎంత కఠిన శిక్షలు అనుభవించినా ఆవగింజంత పరివర్తన రానివారు ఉంటారు. జైలు శిక్షాకాలంలో పరిచయమయిన కొత్త నేర స్నేహాలతో బయటికొచ్చాక మరిన్ని క్రూరమయిన నేరాలు చేసేవారు ఉంటారు.

హైదరాబాద్ లో ఒక రౌడీషీటర్. గిరాకీ తగ్గి, లేదా కోవిడ్ కరువు కాలం వల్లో రౌడీకి బేరాలు రాలేదు. దాంతో ఇప్పుడతడు అరాచకావ్యక్తి కాదని, అతడి వల్ల సమాజానికి ఎలాంటి ఉపద్రవమూ లేదని, సాటి మనుషులను అతడు ఇబ్బంది పెట్టడు అనుకుని అతడి మీద ఉన్న రౌడీ షీట్ ను పోలీసులు ఎత్తేశారు. వారానికోసారి, రెండుసార్లు పోలీసు స్టేషన్ కు వెళ్లి సంతకం చేసి…కనిపించిన ప్రతి ఖాకీకి వంగి వంగి నమస్కారాలు పెట్టే బాధ అతడికి తప్పింది. స్వేచ్ఛా జీవి అయ్యాడు.

Rave Party

అతడికి ఇదొక ఆనంద ఘడియ. మామూలువారయితే పార్టీ అనగానే కడుపు నిండా చికెన్ బిర్యానీ తిని, తినిపించి; గొంతు నిండా మద్యం తాగి, తాగిస్తారు. అతడి గతమెంతో ఘనమయినది. అది మదిలో పురులు కొల్పింది. అంతే…ఊరవతల ఒక ఫార్మ్ హౌస్ బుక్ చేశాడు. తన ఫ్యాన్స్ అందర్నీ పేరు పేరునా ఆహ్వానించాడు. చుక్క, ముక్కలకు తోడు మాదక ద్రవ్యాలతో ‘రేవ్’ పార్టీ ఇచ్చాడు. మధ్యలో నయనానందానికి అమ్మాయిల డ్యాన్స్ అరేంజ్ చేశాడు. ఆకాశానికి చిల్లులు పడే సౌండ్ తో అర్ధరాత్రి ఉన్మత్త నృత్యం చేస్తున్న ఈ రేవ్ పార్టీ గురించి పోలీసులకు తెలిసి దాడి చేసి అందర్నీ అరెస్ట్ చేశారు. మాదకద్రవ్యాలతో పాటు మారణాయుధాలు కూడా దొరికాయి.

ఇప్పుడతడి మీద మళ్లీ రౌడీ షీట్ తెరుస్తారో? లేదో? వేరే సంగతి.

ఏ మాటకామాట.
ఒక సంతోష సమయాన్ని ఎవరికి తోచినట్లు వారు సెలెబ్రేట్ చేసుకుంటారు. మాజీ రౌడీ షీటర్ తన సహజ పద్ధతిలో పార్టీ చేసుకున్నాడు.

అయినా-
భాషలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు…
ఈ రౌడీ షీటర్, మాజీ రౌడీ షీటర్ ఏమిటండి?

ఏదో…
తన స్థాయికి తగినట్లు ఊరవతల ఓ యాభై మంది భావి రౌడీ షీటర్లకు అన్నం పెట్టాడు. అన్నంలో నంజుకోవడానికి ముక్కలు పెట్టాడు. ముక్కలు ముంచుకోవడానికి చుక్కలు పెట్టాడు. చుక్కల్లో తేలడానికి చక్కని నాట్యమాడే చుక్కలను పెట్టాడు. గాల్లో తేలి తేలి ఊగడానికి హుక్కాలో మాదకద్రవ్యం పెట్టాడు. వ్యక్తిగత రక్షణకు బొడ్లో కత్తులు పెట్టుకున్నాడు.

అరె…యార్…క్యా హువా!
ఏ పోలీస్ లోగోనే సబ్ ఉల్టా పల్టా కర్ దియా!
కుచ్ పియా నై…కుచ్ లియా నై…
మై ఖాళీ తమాషా దేఖ్ రహా థా!!

Rave Party

పాపం…
ఈమాత్రానికే మాజీ రౌడీ షీటర్ ను ఆయన ఫ్యాన్స్ సహిత అమ్మాయిలను మూకుమ్మడిగా అరెస్ట్ చేయాలా?

అన్నట్లు…
“రౌడీషీటర్” మాటకు తెలుగు మాట ఉందా? లేదా?
నేరచరిత పత్రం
నేరస్థుడి కాగితం
నేరచరిత చిట్టా…అనవచ్చా?
అలా అనలేకపోతే అప్పుడు ఉన్నది కేవలం ఇంగ్లీషు రౌడీషీటర్లేనా?

తెలుగు నేల మీద “రేవ్ పార్టీ”లు జరుగుతున్నా తెలుగు భాషలో రేవ్ పదానికి అనువాదం లేకపోవడం ఎంత తలదించుకోవాల్సిన విషయం?
డ్యాన్స్, ఫన్, ఫుడ్‌, డ్రింక్, డ్రగ్స్, సెక్స్ కలగలుపు రేవ్ పార్టీ. బహుశా తెలుగు భాష ఇన్ని దరిద్రాలను ఒక పదంలో ఇముడ్చుకోలేకపోయిందేమో!
ఏమో!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

నోట్ల మీద లక్ష్మీ గణపతులు ఉంటే నయమట

RELATED ARTICLES

Most Popular

న్యూస్