Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమిఠాయివాలా మార్కెటింగ్ మెలకువ

మిఠాయివాలా మార్కెటింగ్ మెలకువ

Sweet Auto: మంగళగిరి మెయిన్ రోడ్డు పక్కన ఏ పి ఐ ఐ సి ఆఫీసు. దాని ముందు రోడ్డు మీదే “హలో ఇడ్లి” టిఫిన్ హోటల్. రెండు వారాల పాటు రోజూ ఉదయం ఏడు గంటలకే అక్కడ ఇడ్లీలు తినాల్సిన అనివార్య పరిస్థితి. హోటల్ దగ్గర కారు దిగగానే…పాలకోవా అమ్మే ట్రాలీ ఆటో ఒకటి రోజూ కనిపిస్తుంది. వినిపిస్తుంది. ఆటో వెనుక, ముందు సౌండ్ బాక్స్ లు. అందులో తెలుగు, హిందీలో ముందే రికార్డ్ చేసి పెట్టిన ఆడియో లూప్ లో వెంట వెంట ప్లే అవుతూ ఉంటుంది.

“స్వచ్ఛమయిన పాలతో తయారు చేసిన పాలకోవా….పది రూపాయలే”.

“స్వచ్చ్ దూధ్ సే బనాహువా కలాఖండ్ వాలా కోవా…దస్ రూపయే”

ఇంతవరకు అయితే నేను పట్టించుకునేవాడిని కాను. తెలుగుకు ముందు…

“పాలకోవా…చూసిపోవా!
అందుకోవా…జుర్రుకోవా!
పాలకోవా…పాలకోవా!”

అని ఒక జింగిల్ చక్కటి మ్యూజిక్ తో వస్తోంది. ఏదయినా సినిమాలో పాటేమో అనుకున్నా. ఒక రోజు పొద్దున్నే విపరీతమయిన వర్షం పడుతుంటే ఆ పాలకోవా ఆటో అతను నాతోపాటు హోటల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఈ పాలకోవా పాట సంగతి తేల్చుకోవాలని మాట కలిపాను.

అతడిది రాజస్థాన్ అట. ఇరవై ఏళ్ల కిందట రైలెక్కి విజయవాడ వచ్చేశాడు. చక్కటి కృష్ణా జిల్లా తెలుగు మాట్లాడుతున్నాడు. మొదట ఒక స్వీట్ షాపులో పనిచేసి తరువాత సొంతంగా షాపు పెట్టుకున్నాడట. షాపు నిర్వహణ బరువై చివరికి ట్రాలీ ఆటో సంచార షాపులోకి దిగాడట. ఇప్పుడు బాగుందట. ఇంట్లో స్వీట్లు చేయడం, వీధుల్లో ఆటో మీద అమ్ముకోవడం. అతనే డ్రయివర్. అతనే కౌంటర్లో సేల్స్ మ్యాన్. అతనే ఓనర్.

ఈ పాట సంగతి ఏమిటి? హిందీలో ఆడియో ప్రకటన ఎందుకు? పైగా ఆటో మీద కూడా తెలుగుతో పాటు హిందీ అక్షరాలున్నాయి? అంటే పూసగుచ్చినట్లు అతని మార్కెటింగ్ అనుభవ పాఠం చెప్పాడు- ఒక స్టాన్ఫోర్డ్ మేనేజ్ మెంట్ టీచర్ చెప్పినట్లు.

విజయవాడ, గుంటూరుల్లో సినిమా పాటలంటే క్రేజ్ ఎక్కువట. అందుకు ఏదో సినిమా పాటలో పాలకోవా ట్యూన్ ను అనుకరిస్తూ 30 సెకెన్ల పాట రాయించి, రికార్డు చేయించాడట. హిందీ వినపడగానే ఉత్తరభారతం నుండి ఇక్కడికొచ్చి పనిచేసే వలస కార్మికులు ఆకర్షితులవుతారట. స్పష్టమయిన స్థానిక తెలుగు లేకపోతే ఇక్కడి తెలుగువారు పట్టించుకోరట.

“పాలకోవా…చూసిపోవా!…అందుకోవా!…జుర్రుకోవా!…”
రాసిందెవరో గుర్తు లేదట. కీ బోర్డు ప్లేయరే రాసి ఉంటాడన్నాడు.

ఇంత అంత్యప్రాసలతో పాలకోవా రుచికి ఏమాత్రం తీసిపోని పాటకోవా పేర్చిన ఆ అజ్ఞాత రచయిత నిజంగా అభినందనీయుడు. రోడ్డు మీద మిఠాయిలు అమ్మడానికి ఇంత సాహిత్యం సృష్టించిన మిఠాయివాలా మరింత అభినందనీయుడు. వర్షంవల్ల ఆటో ఫోటో, అతడితో సెల్ఫీ తీసుకోలేకపోయినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను.

సాహిత్య ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడానికి ఎన్నెన్నో పుస్తకాలు చదివాను. చదువుతూ ఉన్నాను. వాటన్నిటినీ తోసిరాజని సాహిత్యానికి ఇంతకంటే తక్షణ ప్రయోజనం ఏముంటుంది? అని మిఠాయివాలా కొత్త పాఠం చెబుతున్నట్లుగా ఉంది నాకు.

ఎంత కోయిల పాట వృధయయ్యెనో కదా
చిక్కు చీకటి వనసీమలందు
ఎన్ని వెన్నెల వాగు లింకిపోయెనొ కదా
కటిక కొండలమీద మిటకరించి
ఎన్ని కస్తురి జింకలీడేరెనో కదా
మురికి తెన్నెల మీద పరిమళించి
ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా
పండిన వెదురు జొంపములలోన
ఎంత గంధవహనమెంత తంగెటిజున్ను
యెంత రత్న కాంతి యెంత శాంతి
ప్రకృతి గర్భమందు! భగ్నమైపోయెనో
పుట్టరానిచోట బుట్టుకతన’’

అని నవయుగ కవితా చక్రవర్తి జాషువా ఇంకేదో సందర్భంలో అన్నాడు. అలా ఇలాంటి వారెందరో వెలుగులోకి రాకుండా ఇలా తమ సృజనాత్మకతను రోడ్ల మీద ప్రదర్శించుకుంటూ…ఆ రోడ్ల మీదే ఉండిపోతూ ఉంటారు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

హిందూపురం రుచులు

Also Read :

సుబ్బి పెళ్లి…

RELATED ARTICLES

Most Popular

న్యూస్