Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఉప్మాతో ఉపమాలంకారానికి ఉపద్రవం

ఉప్మాతో ఉపమాలంకారానికి ఉపద్రవం

Upma-Language:
“ఉపమా కాళిదాసస్య
భారవే రర్థగౌరవం
దండినః పదలాలిత్యం
మాఘే సంతి త్రయోగుణాః

ఉపమా అలంకారానికి కాళిదాసు, అర్థగౌరవానికి భారవి, పదలాలిత్యానికి దండి, ఈ మూడు గుణాలకు మాఘుడు పెట్టింది పేరు. వాల్మీకి బాటలోనే నడిచినా కాళిదాసు కవికుల గురువు కాగలిగాడు. కాళిదాసు వర్ణనలు వర్ణ చిత్రాలు. కదిలే దృశ్యాలు. పోలికలు చెబితే కాళిదాసే చెప్పాలి.

సూర్యుడికి భయపడిన నల్లని చీకటి హిమవత్పర్వతం తెల్లని మంచు గుహల్లో ఆశ్రయం పొందిందట.

పార్వతీదేవి వీధిలో నడుస్తుంటే సంచారిణీ “దీప శిఖేవ” కదిలే దీప శిఖలా ఉందట.

నల్లటి కొండ కొన చుట్టూ తెల్లటి మేఘాలు మెడలో మల్లెల హారంలా చుట్టుకున్నాయట.

యావత్ భారతీయ సాహిత్యానికి అద్దం కాళిదాసు. వెలుగు కాళిదాసు. దారి దీపం కాళిదాసు. సామాన్యమయిన పోలికలతో అసామాన్యంగా చెప్పడంలో కాళిదాసుకు కాళిదాసే పోటీ. ఇది సాహితీ చర్చ కాదు కాబట్టి ఇంతకంటే కాళిదాసు కవితా సౌందర్య ప్రస్తావన, పోలిక- ఉపమాలంకారాల అందం ఇక్కడ అనవసరం.

ఒక హైస్కూల్ విద్యార్థికి పరీక్షలో ఒక ప్రశ్న ఇది.
“ఉపమాలంకారమును గురించి వివరించుము”
ఆ విద్యార్థి ఉప్మా తయారీ గురించి వివరించడానికి ప్రయత్నించాడు/ప్రయత్నించింది.

ఈ అయిదు లైన్ల ఉప్మా తయారీ సమాధానానికి కరకు గుండె టీచర్ సున్నా మార్కులు వేశారు. విద్యార్థి గుండె ఎంతగా విలవిలలాడి ఉంటుందో పాపం!

ఛందో వ్యాకరణ అలంకార శాస్త్రాల్లో పారిభాషిక పదాలన్నీ ఇనుప గుగ్గిళ్ల కంటే కఠినంగా ఉంటాయి.
బహువ్రీహి సమాసం
అనునాసికాలు
కృదంతాలు
తద్దితాలు
విశేషణ పూర్వపద కర్మధారయం
ఉపమ
ఉత్ప్రేక్ష…
ఇలాంటి మాటలన్నీ ఆధునిక తరానికి గ్రహాంతరవాసుల భాషలా అనిపిస్తుంది.

Upma

అమెరికా, బ్రిటన్ యాస ఇంగ్లీషు అయితే వారు విని ఉంటారు కాబట్టి…ఎంత కఠినమయిన పదానికయినా అర్థం చెప్పగలరు. “ఉపమ” లాంటి అత్యంత కష్టమయిన మాట, అలంకారాన్ని ఇప్పటి పిల్లలు వినలేరు. విన్నా అర్థం కాదు. ఒకవేళ అర్థమయినా తెలుగులో రాయలేరు.

ఈ సమాధానంలో విద్యార్ధి ఉప్మానయినా సరిగ్గా వండి వార్చి ఉంటే…ఆ టీచర్ ఉప్మా రుచికి కరిగి…పెద్దమనసుతో తప్పనిసరిగా పాస్ మార్కులు వేసేవారు. ఉప్మాలో ప్రతి పదంలో అక్షర దోషాలతో కాలకూట విషమే దీనికంటే నయం అనిపించేలా ఉంది.

పాపం టీచర్లు.
ఏ జన్మలో ఏమి పాపం చేసుకున్నారో?
ఉపమా అలంకారం ప్రశ్నకు ఉప్మా సమాధానాలు చదువుతున్నారు. ఇది ఒక ఉప్మాతోనే ఆగదు. కృదంతం అంటే కృత్రిమ దంతమవుతుంది. తద్ధితం తప్పనిసరిగా తద్దినమవుతుంది. అనునాసికం నాసికాభరణమవుతుంది. ఉత్ప్రేక్ష ఒట్టి ప్రేక్షక పాత్ర వహిస్తుంది. సంధి సందుల్లో బందీ అవుతుంది. సమాసం సమోసాలో దూరిపోతుంది. మొత్తం తెలుగు అలంకారాలు మేకప్ లేక నిరలంకారాలై కారాలు మిరియాలు కూడా నూరుకోలేక కాలం చేస్తాయి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఉప్మా తిననివాడు దున్నపోతై పుట్టున్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్