Monday, January 20, 2025
HomeTrending Newsజ్ఞానవాపి కేసులో కీలక మలుపు

జ్ఞానవాపి కేసులో కీలక మలుపు

అయోధ్య వివాదం సద్దుమణిగి…దేశ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వారణాసి జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. దీంతో జ్ఞానవాపిలో హిందు దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం దక్కింది.

జ్ఞానవాపి వ్యాసాజీ బేస్‌మెంట్‌లో పూజలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ పై ఇరువర్గాలు వాదనలు విన్నది. శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్, విష్ణు శంకర్ జైన్, సుధీర్ త్రిపాఠి, సుభాష్ నందన్ చతుర్వేది, దీపక్ సింగ్ కోర్టులో వాదనలు వినిపించారు. నంది విగ్రహానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బారికేడింగ్‌ను తెరిచేందుకు అనుమతించాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు 1993కి ముందు తరహాలోనే బేస్‌మెంట్‌లో పూజలకు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఇంతేజామియా మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బేస్‌మెంట్‌ మసీదులో భాగమని, అది వక్ఫ్‌బోర్డు ఆస్తి అని పేర్కొన్నారు. అక్కడ పూజలు చేయకూడదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు హిందువులకు పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. వారంలో పూజలు చేసుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

జ్ఞాన్‌వాపి మసీదు 16వ శతాబ్దంలో హిందూ పుణ్యక్షేత్రమైన విశ్వనాథ ఆలయ శిథిలాలపై నిర్మించారు. ఆరవ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 1669లో ఈ ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. ఇప్పుడీ ప్రాంతం రెండు వర్గాల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది.

జ్ఞాన్‌వాపి తరహాలోనే మధురలో షాహీ ఈద్గా సంక్షోభం మొదలైంది. కాశీ, మథుర విముక్తి కోసం ఉద్యమిస్తామని అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ ఇప్పటికే ప్రకటించింది. తగిన సమయంలో సంఘ్‌ పరివార్‌ వీరికి మద్దతుగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

భారతదేశంలో అయోధ్య రామమందిర ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం 1991లో ‘ప్రార్థనా స్థలాల ప్రత్యేక చట్టాన్ని’ తీసుకొచ్చింది. దాని ప్రకారం 1947 అగస్టు 15నాటికి ప్రార్థనా స్థలాలు ఏ స్థితిలో ఉన్నాయి వాటిని అలాగే కొనసాగించాల్సి ఉంటుంది. అయోధ్య రామమందిర వివాదాన్ని మాత్రం ఆ చట్టం నుంచి మినహాయించారు.

ఢిల్లీలోని జామా మసీదు, అహ్మదాబాద్‌లోని జామా మసీదు కూడా హిందూ ప్రార్థనా స్థలాలపై నిర్మించిన స్థలాలే అని చర్చలు, సూత్రీకరణలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మత ప్రాతిపదికన దేశంలో వివాదాలు మరింత ముదిరే ప్రమాదం పొంచి ఉంది. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించకపోతే ఆందోళనలు పెచ్చరిల్లి…దేశంలో అభివృద్ధి కుంటుపడుతుంది.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జ్ఞానవాపి కేసు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్