Saturday, November 23, 2024
HomeTrending Newsపంజాబ్ లో కాంగ్రెస్ ను ఉడ్చేసిన ఆప్

పంజాబ్ లో కాంగ్రెస్ ను ఉడ్చేసిన ఆప్

 Aap Wins Punjab :

పంజాబ్ లో అమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. అధికార కాంగ్రెస్ తో పాటు బిజెపి, శిరోమణి అకాలిదల్ పార్టీల సీనియర్ నాయకులందరిని ఉడ్చి పారేసింది. రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించింది. ఆప్ ధాటికి ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని ఓటమి చెందక తప్పలేదు. అమృతసర్ తూర్పులో పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పటియాలా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరిందర్ సింగ్ ఓటమి అంచులో ఉన్నారు. పంజాబ్ లో స్వచ్చమైన పాలన అందిస్తామని, బాబా సాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామన్న పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ హామీలకు ఓట్ల వర్షం పడింది. కౌంటింగ్ మొదలైన రెండు గంటల్లోనే ఆప్ మెజారిటీకి అవసరమైన 59  సీట్ల మార్క్ ను దాటేసింది. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలు ఉండగా 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుగుణంగానే ఆప్ విజయపథంలో సాగుతోంది. ఈ రోజు వేకువ జాము నుంచే ఆప్ సిఎం అభ్యర్థి భగ్వంత్ మాన్ నివాసంలో ఉదయం నుంచే మిటాయిలు తయారు చేస్తున్నారు. దూరి లోని ఆయన నివాసం ఇప్పటికే ముస్తాబైంది. 2017 లో జరిగిన ఎన్నికల్లో ఆప్ గెలిస్తే అరవింద్ కేజ్రివాల్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం పంజాబ్లో కొంత నష్టం కలిగించింది. పంజాబ్ లో పంజాబీలే ముఖ్యమంత్రి అనే నినాదం అక్కడ మొదటి నుంచి బలంగా ఉంది. దానికి అనుగుణంగా భగ్వంత్ మాన్  సిఎం అభ్యర్థిగా ఆప్ ప్రకటించటంతో ఈ దఫా కలిసి వచ్చింది.

కాంగ్రెస్ ఓటమికి కారణాలు అనేకం ఉన్నాయి. ఎన్నికలు సమీపంలో ఉన్నా పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రంగా నష్టం చేశాయి. ముఖ్యమంత్రి మార్పు సమయంలో చండీగడ్, ఢిల్లీ సమావేశాలు ప్రజలను పునరాలోచనలో పడేశాయి. కాంగ్రెస్ మార్క్ రాజకీయం మారలేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాయి. అమరిందర్ సింగ్ ను మార్చి చరణ్ జిత్ సింగ్ చన్ని ని సిఎం గా తీసుకురావటం… ఇంత చేసినా అసమ్మతి నాయకుడు నవజోత్ సింగ్ సిద్దులో మార్పు రాలేదు. పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నా సిద్దు ఒక ముఠా నాయకుడిగానే వ్యవహరించటం పార్టీని ఓటమి అంచులకు చేర్చింది. చన్నికి సహకరించకపోగా పార్టీకి నష్టం కలిగించే రీతిలో సిద్దు వ్యాఖ్యలు చేశారు.

పంజాబ్ ఎన్నికలు ఈ దఫా శిరోమణి అకాలిదల్ ను కోలుకోలేని దెబ్బ తీశాయి. కుటుంబ పార్టీగా పేరు పడ్డ అకాలిదల్ అధికారంలో ఉన్నపుడు కుటుంబ సభ్యులకు పదవులు, ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారని, అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. నష్ట నివారణ కోసం రైతు ఉద్యమం మొదలుకాగానే  కేంద్రంలోని ఎన్.డి.ఏ  కూటమి నుంచి బయటకు వచ్చి రైతాంగ పోరాటంలో పాల్గొన్నా అకాలిదల్ ను ప్రజలు నమ్మలేదు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా అకాలిదళ్ నేతలకు ప్రజాదరణ తగ్గిందని స్పష్టంగా ప్రతిఫలించింది. పార్టీకి ఊపు తీసుకొచ్చేందుకు వృద్ద నేత ప్రకాష్ సింగ్ బాదల్ ను ఎన్నికల బరిలోకి దించినా… దళితుల ఓట్లు కొల్లగొట్టేందుకు బిఎస్పి తో జత కట్టినా ఉపయోగపడలేదు.

పంజాబ్ మొత్తం సీట్లు – 117

ఆప్ -92 ,

కాంగ్రెస్ -18,

శిరోమణి అకాలిదళ్ – 03,

బిజెపి -02,

BSP – 01

ఇతరులు -1

RELATED ARTICLES

Most Popular

న్యూస్