Saturday, November 23, 2024
HomeTrending Newsనేటి నుంచి జగిత్యాలలో ఏబివిపి మహాసభలు

నేటి నుంచి జగిత్యాలలో ఏబివిపి మహాసభలు

జగిత్యాల జిల్లా కేంద్రంలో  ఈ రోజు నుంచి (ఈ నెల 9 నుండి 11) ఆదివారం వరకు నిర్వహించనున్న ఏబీవీపీ 41 రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 75 సంవత్సరాలుగా దేశంలోని అన్ని విద్యాక్షేత్రాల్లో పనిచేస్తూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏబీవీపీకి ఒక ప్రత్యేక నేపథ్యం ఉందని, తీవ్రవాదులను, సంఘవిద్ర శక్తులను ఎదుర్కొని ఎంతోమంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అమరులయ్యారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చంద్రారెడ్డి, కాకతీయ యూనివర్సిటీలో సామా జగన్ మోహన్ రెడ్డి, జగిత్యాల ప్రాంతంలో రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి, మధుసూదన్ గౌడ్ తదితర 45 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు కోల్పోయారన్నారు. చైతన్యవంతమైన జగిత్యాల ప్రాంతం జాతీయవాద సిద్ధాంతానికి పునాదులు వేసి దేశవ్యాప్తం గా జాతీయవాదులకు స్ఫూర్తిని నింపిందన్నారు.

ఉద్యమ నేపద్యమున్న జగిత్యాల గడ్డపై ఏబీవీపీ 41 రాష్ట్ర మహాసభలను నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఏబీవీపీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి యజ్ఞ వాల్కేకర్, మను యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ శ్రియం ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ నిరంకుశ పాలన వల్ల పాఠశాల నుండి యూనివర్సిటీ వరకు విద్యారంగం నిర్వీర్యమైందన్నారు. విద్యార్థులు, యువకులు, మేధావులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిగా విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. విద్యారంగాన్ని కాపాడుకునేందుకు, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఏబీవీపీ ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రత్యేక తీర్మానాలను చేస్తుందన్నారు. గత సంవత్సర కాలంగా సంక్షేమ హాస్టల్లలో పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే హాస్టల్ లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని మరణిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న మెకాలే విద్యా విధానానికి స్వస్తి చెప్పి జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యా విధానాన్ని రాష్ట్రములో అమలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేసేంతవరకు విద్యార్థి పరిషత్ పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మహాసభల్లో రాష్ట్రంలోని విద్యారంగా స్థితిగతులు, సామాజిక, రాజకీయ అంశాలపై పలు తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు మహాసభల మొదటిరోజు అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక జరుగుతుందని, రెండవ రోజు జగిత్యాల పట్టణంలో విద్యార్థి శక్తి ప్రదర్శన ఉంటుందని, అనంతరం బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏబీవీపీ జగిత్యాల జిల్లా కన్వీనర్ రాపాక సాయికుమార్, మహిళా విభాగ కన్వీనర్ సౌమ్య, కరీంనగర్ జిల్లా కన్వీనర్ రాకేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్