ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు ఉపసంహరిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తం అవుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో కంచె నిర్మాణ పనులు వేగవంతం చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న డ్యురాండ్ రేఖ కొలమానంగా సరిహద్దుల వెంట ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది. 2600 కిలోమీటర్ల పొడవున ఫెన్సింగ్ పనులు చేపట్టగా 80 శాతం పనులు పూర్తి కావచ్చాయని పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి. 2017 లోనే కంచే నిర్మాణ పనులు చేపట్టినా అమెరికా ప్రకటన తర్వాత పనులు వేగవంతం చేశామని, మరో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని పాక్ సైనిక వర్గాలు తెలిపాయి.
అమెరికా, దాని మిత్ర దేశాలు ఆఫ్ఘన్ నుంచి వెళ్ళిపోతే ఖచ్చితంగా దేశంలో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతాయి. అధికారం కోసం ఆఫ్ఘన్ ప్రభుత్వం – తాలిబాన్ మధ్య జరిగే పోరులో పాకిస్తాన్ ఎటువైపు అనేది చెప్పటం కష్టతరమే. బాహ్య ప్రపంచం కోసం ఆఫ్ఘన్ ప్రభుత్వం వైపు ఉన్నట్టు కనిపించినా పాక్ సైనిక వర్గాలు నిస్సందేహంగా తాలిబాన్ కు తెరచాటు సాయం అందిస్తాయి. పాకిస్తాన్ లోని ఖైభర్ పఖ్తుంక్వా రాష్ట్రంలో తాలిబాన్ ప్రభావం తిరుగులేనిది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉండే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అదేశాలకన్న స్థానిక గిరిజన తెగల నేతలు చెప్పిందే శాసనం.
పాక్ – ఆఫ్ఘన్ సరిహద్దుల్లో రెండు దేశాల ప్రజల రాకపోకలపై పాకిస్తాన్ మంత్రి షేక్ రాషిద్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే మూడు నెలలు పాకిస్తాన్ కు కీలకమైనదన్నారు. నాటో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో సరిహద్దుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఖైభర్ పఖ్తుంక్వా రాష్ట్రానికి చెందిన వారు కావటంతో సరిహద్దుల్లో చిన్న సంఘటన కుడా అంతర్జాతీయ మీడియాలో వార్త అవుతోంది.
మరోవైపు ఆఫ్ఘన్ పరిణామాలపై రేపు భద్రతమండలి సమావేశం కానుంది. చిరకాల మిత్ర దేశమైన ఆఫ్ఘన్ లో శాంతి, సుస్థిర పాలన రావటమే ఆకాంక్ష అని భారత్ ఇప్పటికే ప్రకటించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రేపటి సమావేశంలో భారత్ వైఖరి వెల్లడించనున్నారు.