యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను తెలుగు తెరకు పరిచయం చేస్తూ విశ్వక్‌సేన్ హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో విశ్వక్‌సేన్ తనను, తన యూనిట్ ని అనేక ఇబ్బందులకు గురిచేశాడని, షూటింగ్ కు అంతరాయం కలిగించాడని అర్జున్ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో విశ్వక్‌సేన్ పై తీవ్రంగానే విరుచుకు పడ్డారు.
ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ ..” కొన్నివెబ్ సైట్స్ లో మా సినిమా నుంచి విశ్వక్ సేన్ బయటకు వచ్చాడు అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎందుకు వచ్చాయో నాకు ఏమాత్రం తెలీదు. నా కూతురు ఐశ్వర్యను తెలుగు చిత్ర సీమ ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను. నా స్టొరీ విశ్వక్ సేన్ కి కూడా ఎంతగానో నచ్చింది. తరువాత పారితోషికం విషయంలో కూడా విశ్వక్‌సేన్ చెప్పిన విధంగా అగ్రిమెంట్ కూడా జరిగింది. నా జీవితంలో ఇప్పటి వరకు ఇతనికి చేసినన్ని కాల్స్ ఎవ్వరికీ చేయలేదు. కేరళలో షూట్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైం కావాలి అన్నాడు. ఆ షెడ్యుల్ లో జగపతి బాబు గారు కూడా వున్నారు. ఆయన డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. సీనియర్ హిరోలు ఎంతో కమిట్ మెంట్ తో వుంటారు.
అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా వుంటారు. మన వర్క్ కి మనం సిన్సియర్ గా వుండాలి. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయిలో వుంది. నేను ఇలాంటి వాతావరణంలో నేను విశ్వక్‌సేన్ తో సినిమా చెయ్యడం లేదు అని చెబుతున్నాను. ఈ విషయం అందరికీ తెలియాలి అని ఈ ప్రెస్ మీట్ పెట్టాను. నేను అల్లు అర్జున్‌తో కలిసి పని చేశా. షూటింగ్ అంటే సమయానికి వచ్చేస్తాడు. అంత డబ్బు, పరపతి ఉన్నా, ఇంకా కష్టపడుతూనే ఉంటారు కానీ, విశ్వక్‌సేన్ మాత్రం ‘రేపు షూటింగ్ క్యాన్సిల్ చేయండి’ అని మెసేజ్‌లు పెడతాడు. విశ్వక్‌సేన్ నిబద్ధత లేని నటుడు. ఇండస్ట్రీ పద్ధతులు తెలియకపోతే ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చుందాం. ఇలా షూటింగ్‌లకు క్యాన్సిల్ చెప్పి దర్శకనిర్మాతలను ఇబ్బందులకు గురి చేయవద్దు.
సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్ల అనుభవం నాది. ఇప్పటి వరకూ ప్రెస్‌మీట్ పెట్టి ఇలా మాట్లాడలేదు. నటుడిగా, రచయితగా, దర్శక నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ఫుల్ జర్నీ నాది. ఓ మంచి కథతో మా అమ్మాయిని తెలుగులో పరిచయం చేయాలనుకున్నా. ఇప్పటి వరకూ నేను రాసిన కథల్లో ఇది బెస్ట్ అని చెబుతాను. ఈ కథకు హీరో ఎవరు అనుకున్నప్పుడు విశ్వక్‌సేన్ నా మదిలో మెదిలారు. ఆయనకు సీన్ టు సీన్ వివరించా. అంతా ఓకే అయింది. పారితోషికం విషయం వచ్చేసరికి ఆయన మేనేజర్ చెప్పింది నాకు వర్కవుట్ కాలేదు. ఎలాగా అని ఆలోచిస్తుంటే.. ఆయనే ఓ ఏరియా సినిమా నేను తీసుకుంటాను అన్నారు. అందుకు అంగీకరించాను. అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అంతా కామ్ అయిపోయింది. అక్కడి నుంచి ఎన్నిసార్లు కథా చర్చలకి పిలిచినా విశ్వక్ కాల్ కూడా తీయలేదు.
ఇన్నేళ్ల నా అనుభవంలో ఎవరికీ నేను అన్ని సార్లు ఫోన్స్ చేసి ఉండను. దానిని కూడా నేను తప్పుగా అనుకోలేదు. తను హీరోగా, దర్శకనిర్మాతగా చాలా బిజీగా ఉన్నాడని అర్ధం చేసుకున్నా. కాస్ట్యూమ్ డిజైనర్‌ని పంపినా అతను టైమ్ ఇవ్వలేదు. తర్వాత నేనే మాట్లాడి 30 రోజులు షెడ్యూల్ గురించి చెప్పా. సరేనని.. మళ్లీ కొంచెం సమయం కావాలి. ‘ఫారిన్ నుంచి వచ్చా.. ట్యాన్ అయ్యా, ఫిజిక్ ఛేంజ్ చేయాలి. ఫ్రెష్‌గా వస్తానని’ చెప్పడంతో నేను కూడా ఓకే అన్నా. అప్పటికే నేను జగపతిబాబు, కేరళలో కొందరి ఆర్టిస్ట్‌ల డేట్స్ ఫిక్స్ చేసుకున్నా. మూడు రోజులు అన్న అతను ఎంటైర్ షెడ్యూల్‌కి రాలేదు. జగపతిబాబు డేట్స్ వృధా చేయకూడదని ఆయనతో కొన్ని సన్నివేశాలే తీశా. ఆ తర్వాత వారానికి మళ్లీ సిట్టింగ్ జరిగింది.
ఈ నెల మూడో తేదీ నుంచి డిసెంబర్ పదో తేదీ వరకూ ఏ పనీ పెట్టుకోవడం లేదు. మీకే చేస్తానని చెప్పి.. మళ్లీ వారం గ్యాప్ కావాలన్నారు. దానికి కూడా అడ్జస్ట్ అయ్యా. తదుపరి మీటింగ్‌లో హీరో పేరు మార్చుదామా అని అడగగానే విశ్వక్ కొన్ని పేర్లు సజెస్ట్ చేశాడు. తాజా షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణకు రావాలని అడగగా హెయిర్ డ్రెస్సింగ్ ఫొటోలన్నీ పంపి రేపటి నుంచి మనదే చేద్దాం అని చెప్పి… షూట్‌కి అంతా రెడీ చేసుకొని ఆరు గంటలకు షూటింగ్‌కు రమ్మంటే ఉదయం 5 గంటలకు నాకు విశ్వక్ నుంచి మెసేజ్ వచ్చింది. ‘సర్ ఐయామ్ సారీ ప్లీజ్ క్యాన్సిల్ షూట్’ అని చూసే సరికి, ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఏ మాట్లాడాలో కూడా తెలియలేదు. కథ, క్యారెక్టర్, డైలాగ్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడనిపించింది. అది చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యా. డే అండ్ నైట్ కష్టపడి సెట్ సిద్థం చేసిన తర్వాత షూటింగ్ క్యాన్సిల్ అనడం ఎంత వరకు కరెక్ట్ అని అర్జున్ ప్రశ్నించారు.
ఈ విషయం చెప్పడానికే ప్రెస్‌మీట్ పెట్టా. కొన్ని రోజులు తర్వాత కాంప్రమైజ్ అయినా, ఈ సినిమా చేయను. రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు, చంద్రబోస్ సాహిత్యం, అనూప్ సంగీతం అతనికి నచ్చడం లేదు. నటుడిగా అతడు కొన్ని సూచనలు చేయడంలో తప్పులేదు. కానీ, మేకర్‌గా నాకు నచ్చాలి కదా! చాలా సార్లు సర్ది చెప్పా. వినలేదు. ఇలాంటివి అందరికీ తెలియాలి. బయటకు మాట్లాడలేని నిర్మాతలు చాలా మంది ఉంటారు. నాకు ధైౖర్యం, శక్తి ఉన్నాయి. అందుకే ఇలా చెబుతున్నా. దర్శక నిర్మాతలకైనా వ్యక్తి మర్యాద ఇవ్వాలి. నచ్చనపోతే ‘ఈ సినిమా చేయాల్సిందే’ అని ఎవరూ బలవంతం చేయరు. ఇండస్ర్టీలో పద్థతులు తెలియకపోతే, సినిమాలు చేయకండి అని అర్జున్ అన్నారు.