సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయస్సు 71సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజి) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మల్టీ ఆర్గాన్స్ విఫలం కావడంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు.
శరత్ బాబు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస. 1951 జూలై 31న జన్మించినా ఆయన అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1973లో రామరాజ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అభినందన, స్వాతిముత్యం, శరణం అయ్యప్ప, సీతాకోక చిలుక, నీరాజనం, ఓ భార్య కథ, సంసారం ఒక చదరంగం, సితార, కోకిల, క్రిమినల్, ఆపద్భాందవుడు లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. వకీల్ సాబ్ సినిమాలో కూడా అయన నటించారు. వికె నరేష్, పవిత్ర నటించిన ‘మళ్ళీ పెళ్లి’ శరత్ బాబు చివరి సినిమా.
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో హీరోగా, సహాయ నటుడిగా దాదాపు 300 పైగా సినిమాల్లో నటించారు.
సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం సినిమాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు.