ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మరణించారు. గత కొంతకాలంగా అనార్యోగం బాధపడుతున్న ఆయన గుండెపోటుతో కూకట్ పల్లిలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. సొంతూరు రాజమండ్రి అయినప్పటికీ చెన్నైలో స్థిరపడ్డారు. అందుచేత చిన్నప్పటి నుంచి పెరిగింది అంతా చెన్నైలోనే. సంగీతం పై ఆసక్తితో డిగ్రీని పక్కనపెట్టి మరీ.. వెస్ట్రన్, క్లాసికల్ మ్యూజిక్ లో మెళుకువలు నేర్చుకున్నాడు. సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర రాజ్ – కోటి అసిస్టెంట్స్ గా వర్క్ చేశారు. అప్పటి నుంచి రాజ్ – కోటి మధ్య స్నేహం ఏర్పడింది.
1982లో ప్రశయగర్జన చిత్రం ద్వారా రాజ్ – కోటి సంగీత దర్శకులుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. రాజ్ – కోటి సంగీతం అందించారంటే ఆ సినిమా హిట్టే అనే పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి యముడుకు మొగుడు, లంకేశ్వరుడు, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్.. ఇలా ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు. కెరీర్ లో మంచి స్థాయిలో ఉన్నప్పుడు విభేదాలు కారణంగా రాజ్ – కోటి విడిపోయారు. ఆతర్వాత కలుసుకున్నప్పటికీ.. వేరే వేరుగానే వర్క్ చేశారు. రాజ్ సొంతంగా ఓ పది చిత్రాలకు సంగీతం అందించారు. ఆ పది చిత్రాల్లో చెప్పుకోదగ్గ సినిమా సిసింద్రీ అని చెప్పచ్చు. రాజ్ మరణించడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.