Friday, September 27, 2024
Homeసినిమావెలుతురులో ఉన్నంత వరకే నీడ తోడు....

వెలుతురులో ఉన్నంత వరకే నీడ తోడు….

Girija  : జీవితం ప్రతి ఒక్కరికీ ఒక అవకాశం ఇస్తుంది. అనుభవాలను పాఠాలుగా విభజించి అందమైన పుస్తకాన్ని తయారు చేసి చేతిలో పెడుతుంది. ఆ అనుభవాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకునేలా చేస్తుంది. అయితే జీవితమనే ఈ ప్రయాణంలో .. ఈ పరుగు పందెంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోకపోయినా, అనుభవం నేర్పిన పాఠాలను పట్టించుకోకపోయినా అగాధంలోకి జారిపోవలసి వస్తుంది. కన్నీటి ధారగా మిగిలిపోవలసి వస్తుంది. చిత్రపరిశ్రమలో ఎంతో మంది నటీనటుల జీవితాలు ఆ జాబితాలో కనిపిస్తాయి .. అందులో హాస్యనటి గిరిజ ఒకరు.

1950 నుంచి తెలుగు సినిమా పరిణామ క్రమంలో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఆ మార్పును ఎంతోమంది నటీనటులు ప్రత్యక్షంగా చూశారు .. అందులో తాము కూడా భాగమయ్యారు. ఆ సమయంలో తెలుగు తెరపై గిరిజ ఒక వెలుగు వెలిగారు. కృష్ణా జిల్లా నుంచి సినిమా ఫీల్డ్ కి వెళ్లిన తొలితరం నటీమణులలో ఆమె ఒకరుగా కనిపిస్తారు. ‘కంకిపాడు’లో పుట్టిపెరిగిన గిరిజకి నటన పట్ల ఆసక్తి ఉండేది. అందుకు కారణం ఆమె తల్లి దాసరి రామతిలకం సినిమాల్లో నటిస్తూ ఉండటమే. అందువలన సినిమాల్లోకి గిరిజ తేలికగానే ప్రవేశించింది.

ప్రముఖ హాస్యనటుడు కస్తూరి శివరావు ఆమెను వెండితెరకి పరిచయం చేశారు. కథానాయిక కావాలనే ఉద్దేశంతోనే గిరిజ  ఎంట్రీ ఇచ్చారు. అయితే అప్పటికే నటన పరంగా .. గ్లామర్ పరంగా తిరుగులేని కథానాయికలు బరిలో ఉన్నారు. అయినప్పటికి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. హరనాథ్ .. జగ్గయ్య వంటి కథానాయకుల సరసన కథానాయికగా ఆమె ఒకటి రెండు సినిమాల్లో నటించారు. ఆ తరువాత నాయికల రేస్ లో నిలబడలేక ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అలాంటి సమయంలోనే ఆమె హాస్య పాత్రల వైపు మొగ్గు చూపారు.

రేలంగితో ఆమె చేసిన ఒక హాస్య పాత్ర పాప్యులర్ కావడంతో, ఇక అప్పటి నుంచి వాళ్ల జోడీ ఊపందుకుంది. హీరో హీరోయిన్లతో సమానంగా రేలంగి – గిరిజ ట్రాక్ నడుస్తుండేది. హీరోలు ఒక సినిమా చేసే సమయంలో  రేలంగి – గిరిజ కలిసి పది సినిమాల్లో చేస్తుండేవారు. దాంతో ఎన్టీఆర్ – ఏఎన్నార్ వంటి ఎదురులేని కథానాయకులు సైతం వారి డేట్స్ కోసం ఎదురుచూడవలసిన పరిస్థితి వచ్చింది. ఒకానొక దశలో ఈ జోడీ లేని సినిమా ఉండేది లేదు. సూర్యకాంతానికి గారాల కూతురిగా .. రేలంగికి గడుసు భార్యగా గిరిజ పండించిన పాత్రలను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. 

గిరిజ కెరియర్లో ‘పాతాళ భైరవి’ .. ‘గుడి గంటలు’ .. ‘ జగదేకవీరిని కథ’ .. ‘అన్నపూర్ణ’ .. ‘ఆరాధన’ .. ‘వెలుగు నీడలు’ .. ‘లవకుశ’ వంటి ఎన్నో సినిమాలు మైలురాళ్లుగా కనిపిస్తాయి. అప్పట్లో కొంతమంది హీరోయిన్లతో సమానమైన పారితోషికాన్ని ఆమె అందుకున్నారని చెబుతారు. ఆ సమయంలోనే గిరిజ ఇంట కాసుల వర్షం కురిసేసింది. ఎంతో పేదరికాన్ని చూస్తూ పెరిగిన గిరిజ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. ఖరీదైన కార్లు .. బంగ్లాల మధ్య ఆమె కెరియర్ నడిచింది. స్టార్ హీరోయిన్స్ తో సమానమైన వైభవాన్ని ఆమె చూశారు.

ఆ సమయంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ సన్యాసి రాజుతో ఆమె ప్రేమలో పడటం .. పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. జీవితంలో సరిదిద్దుకునే తప్పులు చేయడం వలన కొంతకాలం మాత్రమే కష్టాలు పడవలసి వస్తుంది. కానీ పెళ్లి విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలన అందుకు జీవితాన్నే మూల్యంగా చెల్లించవలసి వస్తుంది. అలా పెళ్లి తరువాత కష్టాల పాలైన నటీమణుల జాబితాలో గిరిజ కూడా చేరిపోయారు. సినిమాల నిర్మాణం చేపడదామని సన్యాసిరాజు అనడంతో, తాను సంపాదించిందంతా ఆమె ఆయన చేతిలో పెట్టారు.

అతని పెత్తనంలో ఆ డబ్బంతా హారతి కర్పూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. కార్లలో తిరిగిన దారుల్లో కాళ్లు కాలేలా తిరగడానికి ఆమెకి ఎక్కువ కాలం పట్టలేదు. రేలంగి తరువాత ఆమెకి ఆ స్థాయిలో అండగా నిలిచేవారు ఎవరూ లేకపోవడంతో, గిరిజ ఆర్థికంగా ఎన్నో ఇబ్బదులు పడ్డారు. చిన్న చిన్న పాత్రలు చేయడానికి కూడా ఆసక్తిని కనబరిచారు. సంపాదనలేనివారిని చూసి ఈ లోకం జాలిపడుతుందేమోగానీ, సంపాదించి పోగొట్టుకున్నవారి పట్ల మాత్రం కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంది. గిరిజ విషయంలోనూ అలాగే జరిగింది.

అలా వరుస సినిమాలతో ఇండస్ట్రీని చుట్టబెట్టేసిన గిరిజ .. ప్రదక్షిణ చేసినట్టుగా మళ్లీ మొదటికి వచ్చారు. బాగా పరిచయమున్న కొంతమంది కథానాయికల సహాయ సహకారాలతో కాలాన్ని నెట్టుకొచ్చిన గిరిజ, ఆ తరువాత అనారోగ్య కారణాల వలన కన్నుమూశారు. తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన కస్తూరి శివరావు మాదిరిగానే తను కూడా ఆర్ధిక ఇబ్బందులతో  తనువు చాలించడం బాధాకరం. వెలుతురులో ఉన్నంత వరకే నీడ తోడు వస్తుంది .. చుట్టూ చీకట్లు కమ్ముకున్నప్పుడు నీడ కూడా కనబడకుండా పోతుందని అంటారు .. అదే విషయం ఆమె అనుభవంలోకి వచ్చింది. ఏది ఏమైనా ఆమె గొప్ప హాస్యనటి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రోజున (మార్చి 3న) ఆమె జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆమెను స్మరించుకుందాం.

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : నాని… మన పక్కింటబ్బాయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్