Saturday, January 18, 2025
Homeఫీచర్స్డిజిటల్ డీటాక్స్ కావాలి

డిజిటల్ డీటాక్స్ కావాలి

ఆ అమ్మాయి వయసు మూడుపదులు దాటింది. మంచి ఉద్యోగం. కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు. ఆమె స్నేహితులు కొంతమంది సినిమాలు, సీరియల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వారికున్న ఫాలోయింగ్ చూశాక ఈ అమ్మాయి అంతకన్నా పెద్ద సెలబ్రిటీ అయిపోవాలనుకుంది. పొద్దున్న బ్రష్ చేసుకుంటూ, కాఫీ కలుపుతూ, మేకప్ చేసుకుంటూ వీడియోలు తీసి పోస్ట్ చెయ్యడం ప్రారంభించింది. అయితే ఈమె పోస్టులకు స్పందన రాకపోవడంతో మిగిలిన వారిపైన అసూయ, దుఃఖం కలిగాయి. రోజంతా ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ చూసుకుంటూ ఇంకాస్త డిప్రెషన్ కి గురవుతూ తిండి తిప్పలు పట్టించుకోవడం మానేసింది. నిద్ర అసలే లేదు. దాంతో ఆరోగ్య సమస్యలు… డాక్టర్ ఆమెని బాగా తిట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండమన్నారు. ఇటువంటివి వందలు, వేల కేసులు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే గొప్ప ఉద్యోగం అనుకుంటూ అందరూ అదే పనిలో ఉన్నారు. చుట్టూ డిజిటల్ గోడలు కట్టుకుని అందరి గోడలు ఎక్కుతూ దిగుతూ రెప్ప వాల్చడంలేదు.

పసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా సెల్ ఫోన్ బందీలే. పిల్లల్ని ఊరుకోబెట్టడం కోసం ఇచ్చే సెల్ ఫోన్ పెరిగేకొద్దీ వారిపాలిట ఉరితాడులా మారుతోంది.

ఒకప్పుడు … అంటే సెల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఓటీటీ లేని రోజులు. ఎప్పుడన్నా బజారుకెళ్ళడం లేదా సినిమా కెళ్ళడం … అవిచాలు కొన్నిరోజులపాటు ఉత్సాహంగా ఉండటానికి. ఏదన్నా ఊరు వెళ్తే ఇక సంతోషం చెప్పలేం. వైద్య పరిభాషలో చెప్పాలంటే అదే డోపమైన్ ప్రభావం. అంటే సంతోషాన్ని, ఉత్తేజాన్ని కలిగించే హార్మోన్. కొన్నేళ్ల క్రితం వరకు అప్పుడప్పుడు కలిగే అనుభవం ఇప్పుడు ప్రతిరోజూ ప్రతిక్షణం కావాలనుకుంటున్నారు. పొద్దున్న లేచిన దగ్గరినుంచి సెల్ ఫోన్లో పలకరింపులతో రోజు ప్రారంభం అవుతోంది. వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో విహరిస్తోంది. దీనికి బీద గొప్ప, చిన్నా పెద్దా కులమత భేదాల్లేవు. ఆడా మగా తేడాలు లేవు . దాంతో వరసలు మారిపోతున్నాయి. బంధాలు తెగిపోతున్నాయి. ఇంట్లో గొడవలు పెరిగిపోతున్నాయి. వేళా పాళా లేకుండా ఇరవై నాలుగు గంటలూ సోషల్ మీడియాలో ఉంటూ శారీరక మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఓటీటీ ల రంగ ప్రవేశంతో దిక్కులేనన్ని సినిమాలు. కళ్ళు, మనసు అలసిపోవూ మరి!

సెల్ ఫోన్ కాస్తా స్మార్ట్ ఫోన్ గా అవతరించి, సోషల్ మీడియా రంగ ప్రవేశం చేసినప్పటినుంచీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేతిలో ఫోన్ ఉన్న వారంతా గూగులమ్మని సంప్రదించి తమ రోగాలకు పేర్లు పెట్టుకుంటున్నారు. అలా ఇటీవల కాలంలో వినిపిస్తున్న పదం డోపమైన్ డిటాక్స్. అంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియాకి దూరంగా ఉండటం. చాలామందికి ఇప్పుడిదో ఫ్యాషన్.

నిజానికి డోపమైన్ అనేది ఒక రకమైన హాయిని సంతోషాన్ని కలిగించే హార్మోన్. ఏదైనా ఎక్కువైతే ప్రమాదమే అన్నట్టు ఇప్పటితరం డోపమైన్ ఎక్కువై బాధపడుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం? వారమో పది రోజులో ఫోన్లు, టీవీ పక్కన పెడితే సరిపోతుందా అంటే సరిపోదనే నిపుణుల అభిప్రాయం. మన అలవాట్లను మార్చడానికి కనీసం ఆరునెలలు గట్టిగా ప్రయత్నించాలి. ఓకే సారి కాకుండా కొద్దికొద్దిగా తగ్గిస్తూ పోవాలి. ముందు రోజులో ఎంత సమయం అన్నది నిర్ణయించుకోవాలి. రాత్రిపూట ఫోన్ దగ్గర పెట్టుకోకూడదు (ఆ కాంతి మంచిది కాదు). ఆరోగ్యకరమైన వ్యాయామ అలవాట్లు చేసుకోవాలి. మనసుకు హాయిని, విశ్రాంతిని ఇచ్చే పద్ధతులు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఫోన్ల లోనే స్క్రీన్ టైం ట్రాకర్ ఉంటోంది. దాన్ని బట్టి జాగ్రత్త పడచ్చు. అప్పుడప్పుడు అకౌంట్ డీ యాక్టివేట్ చెయ్యచ్చు. రకరకాల నోటిఫికెషన్స్ రాకుండా చెయ్యచ్చు. మన జీవితం మన చేతిలోనే ఉండాలి గానీ సెల్ లో బందీ కాకూడదంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

చివరగా చిన్నమాట. ఫేస్ బుక్ బెజోస్ అయినా, ట్విట్టర్ మస్క్ అయినా, జియో అంబానీ అయినా మన బలహీనతతో వ్యాపారం చేస్తున్నారు. మనమెందుకు వారికోసం నిద్ర మానుకోవాలి? జీవితం ఎందుకు కోల్పోవాలి? ఫోన్ పక్కన పెట్టి ఆలోచించండి. అప్పుడు వినిపిస్తుంది ప్రకృతి పాడే జోలపాట.

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్