Wednesday, June 26, 2024
HomeTrending Newsఆదిలాబాద్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ

ఆదిలాబాద్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ

దక్షిణాదికి..తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉండే ఆదిలాబాద్ లో ఎంపిగా పోటీ చేసిన మహామహులు అనుకున్న నేతలను మట్టి కరిపించిన చరిత్ర ఇక్కడి ఓటర్లది. ఒక్కోసారి ఒక్కో రకమైన తీర్పు ఇస్తూ ఉంటారు. అనామకులుగా రంగంలో నిలిచిన వారిని అందలమెక్కించిన ఘనత ఆదిలాబాద్ సొంతం. పార్లమెంటు స్థానంపై పట్టు నిలబెట్టుకునేందుకు బిజెపి యత్నిస్తుండగా… హస్తం అడ్డాగా మార్చేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు.

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి గెలిచిన సోయం బాపూరావు సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి నగేశ్‌ను ఓడించిన సోయం.. సంచలన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడోస్థానానికి పరిమితం అయింది. సిట్టింగ్‌లను మట్టికరిపిస్తూ.. కొత్తవారికి అవకాశం ఇస్తూ… ఆదిలాబాద్ పార్లమెంట్‌ పరిధిలో ఓటర్లు ప్రతీసారి వినూత్న తీర్పు ఇస్తున్నారు.

సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ముధోల్, ఆదిలాబాద్, నిర్మల్, బోథ్ శాసనసభ స్థానాలు ఆదిలాబాద్ పరిధిలోకి వస్తాయి. సిర్పూర్, ముధోల్, నిర్మల్, ఆదిలాబాద్ స్థానాల్లో బిజెపి ఎమ్మెల్యేలు ఉండగా.. బోథ్, ఆసిఫాబాద్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది.

1952 నుంచి ఆదిలాబాద్ ఎంపి స్థానం ఉండగా 2009లో STలకు రిజర్వ్ చేశారు. 2009లో టిడిపి అభ్యర్థి రమేష్ రాథోడ్ ఎంపిగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి గోడెం నగేష్ గెలవగా.. 2019లో బిజెపి అభ్యర్థి సోయం బాబురావు జయకేతనం ఎగురవేశారు.

ఈసారి సిట్టింగ్ ఎంపి సోయం బాబురావును కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన గోడెం నగేష్ ను బిజెపి రంగంలోకి దింపింది. బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ బరిలోకి దిగారు. నక్సల్ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చి.. ఉపాధ్యాయురాలిగా స్థిరపడిన ఆత్రం సుగుణను పార్టీలోకి తీసుకురావటంలో మంత్రి సీతక్క కీలక పాత్ర పోషించారు.

ఎంపి స్థానంలో 14 లక్షల పైచిలుకు ఓటర్లు ఉండగా… వీరిలో పురుషులు 6,97,389 మంది ఉండగా, మహిళా ఓటర్లు 7,09,844 మంది ఉన్నారు. నియోజకవర్గంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే అధికంగా ఉండడం విశేషం. ఈ దఫా ముగ్గురు అభ్యర్థులు ఆదివాసి సామాజికవర్గం వారే కావటం గమనార్హం.

బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆయనకు కాకుండా కోవా లక్ష్మికి ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఎంపి టికెట్ వరించింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పట్టనట్టే ఉంటున్నారు. కేవలం జోగు రామన్న గెలుపు బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. మారిన రాజకీయ సమీకరణాల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

మాజీ ఎంపి గోడెం నగేష్ బీఆర్ఎస్ వదిలి కమలం తీర్థం పుచ్చుకోగానే పార్టీ టికెట్ దక్కింది. ఆదివాసి నినాదంతో సోయం గెలిచినా బిజెపి నుంచి స్పష్టమైన హామీ లభించలేదని… బిజెపి ఆదివాసీలను ఓటర్లుగానే చూస్తోందనే విమర్శలు ఉన్నాయి. నగేష్ పట్ల నియోజకవర్గంలోని పశ్చిమ ప్రాంత ప్రజలు సానుకూలంగా ఉన్నా తూర్పులో అంత ఆదరణ లేదని విశ్లేషణ జరుగుతోంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు తూర్పు ప్రాంతం వారే కావటం… మహారాష్ట్ర ప్రభావం ఉండే ఈ నియోజకవర్గంలో బిజెపి సునాయాసంగా గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

ఆదిలాబాద్లో 1984 వరకు జైత్రయాత్ర కొనసాగించిన కాంగ్రెస్ పార్టీకి, అప్పుడే కొత్తగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ చెక్ పెట్టింది. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. తెలంగాణ ఉద్యమంతో ఈ స్థానంలో బీఆర్ఎస్ బలం పుంజుకుంది. కాంగ్రెస్ ను ఇక్కడి ఓటర్లు ఆడరించాటంలేదు. 1989లో గెలిచిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏడాదిపాటు పదవిలో కొనసాగారు. 15ఏళ్ళుగా ఇక్కడ గెలవని కాంగ్రెస్ ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ… ప్రజా ఉద్యమాల్లో చురుకుగా వ్యవహరిస్తూ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 2008లో సుగుణకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.  ఓవైపు ఉపాధ్యాయ బాధ్యతలను నిర్వరిస్తూనే… మరోవైపు మానవ హక్కుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అనేక ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉట్నూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సుగుణ…. ఇటీవలే (మార్చి 12) ఉద్యోగానికి రాజీనామా చేశారు. మార్చి 13వ తేదీనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

13 ఏళ్ల సర్వీస్ ఉండగానే… కొలువును పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. సుగుణ భర్త భుజంగరావ్ కూడా ప్రభుత్వ టీచరే. ఆయన కూడా హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. దంపతులు ఇద్దరూ ఉపాధ్యాయ సమస్యలతో పాటు ఆదివాసీల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. వీరి పిల్లలు ఆత్రం విప్లవ్ కుమార్, సాయుధ కళాకారులుగా గుర్తింపు పొందారు. విప్లవ్ కుమార్… వైద్య విద్య పూర్తి చేశాడు. చిన్న కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోరు కొనసాగుతున్నా… ప్రధానమైన పోటీ హస్తం- కమలం మధ్యనే కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థికి సానుకూల పవనాలు ప్రారంభం అయ్యాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు మంత్రి సీతక్క కొన్నాళ్ళుగా ఆదిలాబాద్ లో మకాం వేసి అభ్యర్థి ఎంపిక నుంచి పార్టీ నేతల మధ్య సమన్వయము చేస్తూ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేల బలం, ప్రధాని మోడీ చరిష్మ గట్టెక్కిస్తుందని కమలం నేతలు భరోసాగా ఉన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్