ఆసియా కప్ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకపై 8 వికెట్లతో విజయ కేతనం ఎగురవేసింది. బౌలింగ్ లో సత్తా చాటి లంకను 105 పరుగులకే పరిమితం చేసిన ఆఫ్ఘన్ ఈ లక్ష్యాన్ని కేవలం 10.1 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సీమర్లు ఫజల్ హక్ ఫారూఖి, నవీన్ ఉల్ హక్ దెబ్బకు శ్రీలంక ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టులో భానుక రాజపక్ష-38; కరుణరత్నే-31, గుణతిలకే-17 మాత్రమే రాణించి రెండంకెల స్కోరు చేశారు. 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఫజల్ హక్ ఫారూఖి మూడు; ముజీబ్, కెప్టెన్ నబీ చెరో రెండు; నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాతా బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆఫ్ఘన్ ఓపెనర్లు తొలి వికెట్ కు 83 పరుగులు చేశారు. రహ్మతుల్లా గుర్జాబ్ 18 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లతో 40 పరుగులతో ధాటిగా రాణించగా, ఫస్ట్ డౌన్ లో వచ్చిన ఇబ్రహీం జర్డాన్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
మూడు కీలక వికెట్లు తీసిన ఫజల్లా ఫారూఖీ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.