రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే తాను ప్రజల్లోకి వస్తున్నానని అధికారం కోసం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు జగన్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీలో తిరుగుబాటు మొదలైందని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో జరిగిన రా! కదలిరా! బహిరంగ సభలో బాబు ప్రసంగించారు. 68 మందికి టిక్కెట్లు ప్రకటిస్తే.. సీట్లు నిరాకరించినవారిలో ఎక్కువ శాతం ఎస్సీలు, బిసిలే ఉన్నారని తెలిపారు.
జగన్ తో వేగలేమని నలుగురు ఎంపిలు, ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పారిపోయారని, రేపో మాపో తాము గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పారు. ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారన్నారు. పదిమంది మంత్రులు ఇప్పటికే ఓడిపోయారన్నారు. తెలుగుదేశం-జనసేన పొత్తుతో వైసీపీ నేతల ప్యాంట్లు తడిసిపోతున్నాయని, డైపర్లు వేసుకొని తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కోనేటి ఆదిమూలం ఎంపిగా పోటీ చేసేందుకు నిరాకరించారని, మరోవైపు కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కూడా జగన్ కు ఎదురుతిరిగాడని అంటూ నేడు ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని ప్రస్తావించారు. ఎన్నికలకు ముందే ఆ పార్టీ ఓటమి ఖాయమైందని , ఎన్నికల తర్వాత వైసీపీ ఖాళీ అయిపోతుందని బాబు జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని, నిన్న ఒక్కరోజే నాలుగు సంఘటనలు జరిగాయని ఇవన్నీ చూస్తుంటే ఏపీ ఎమైపోతుందో అనే బాధ ఉందని, అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, యువత భవిష్యత్తు కోసం వచ్చానని, ప్రజలు మద్దతివ్వాలని బాబు విజ్ఞప్తి చేశారు. యువత ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇస్తున్నారని, రాష్ట్రంలో గంజాయి దొరకని ప్రదేశం ఏదైనా ఉందా అంటూ ప్రశ్నించారు.